‘లేని ఫ్యూచర్ సిటీ.. కట్టని అమరావతి’ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ, ఏపీ రాజధాని అమరావతిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-09-29 11:55 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ, ఏపీ రాజధాని అమరావతిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని గురుశిష్యులుగా అభివర్ణించిన జగదీష్ రెడ్డి ఆ ఇద్దరి డ్రీమ్ ప్రాజెక్టులను ఒకే గాటన కడుతూ రియల్ ఎస్టేట్ దందా కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతోపాటు బులెట్ రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

తెలంగాణలో హైదరబాద్ నగరానికి ఆనుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. టీ.సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచం గర్వించేలా అద్భుత నగరం నిర్మిస్తామని ఫార్చున్ 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి రప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా ఏపీ రాజధాని అమరావతిని అనుసంధానించేలా ఫ్యూచర్ సిటీ నుంచి బులెట్ ట్రైన్ కు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి చేసిన విమర్శలు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు ఏపీ రాజధాని అమరావతిపైనా విమర్శలు గుప్పించి చంద్రబాబును తమ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తుందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను కోట్ చేస్తూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి అటు ఫ్యూచర్ సిటీతోపాటు ఇటు అమరావతిపైనా విమర్శలు గుప్పించడం వెనుక భారీ వ్యూహమే ఉందని అంటున్నారు. ‘ఎక్కడ ఫ్యూచర్ సిటీ, ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఎప్పుడు ఉంటాడో? ఎప్పుడు పదవి నుంచి ఊడతాడో తెలియదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్కడితో ఆగకుండా ఏపీ సీఎం చంద్రబాబుపైనా మాటల తూటాలు పేల్చారు.

‘లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే అంటు, మళ్లీ దానిపక్కన రైలు అంట, ఒక దానిలో గురువు గారు, మరో దాన్లో శిష్యుడు ఎక్కుతారా? తిరిగి వచ్చేటప్పుడు గురు శిష్యులు రోడ్డు మార్గంలో కలిసి వస్తారా?’ అంటూ జగదీష్ రెడ్డి వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘ఇదంతా దేనికి? కేవలం రియల్ ఎస్టేట్ దందానే’ రేవంత్ రెడ్డి, తన తాబేదార్లు, బంధుమిత్రులు కొన్న భూముల ధరల పెంచడానికే ఇదంతా చేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఏం కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అటు తెలంగాణతోపాటు ఏపీలో రాజకీయ దుమారం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని అమరావతిపై విషం చిమ్మడానికే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోందని టీడీపీ సోషల్ మీడియా విమర్శలు చేస్తో కౌంటర్ అటాక్ ప్రారంభించింది.

Tags:    

Similar News