ఫుల్ ట్యాంక్ కొట్టించే అలవాటు ఉందా? అయితే డేంజరే!
పెట్రోల్ బంక్ కు వెళ్లి.. కారు ఆపి.. ఫుల్ ట్యాంక్ అనే మాట నూటికి తొంభై శాతం మంది అనేస్తుంటారు.;
పెట్రోల్ బంక్ కు వెళ్లి.. కారు ఆపి.. ఫుల్ ట్యాంక్ అనే మాట నూటికి తొంభై శాతం మంది అనేస్తుంటారు. అయితే.. ఇలా ఫుల్ ట్యాంక్ చేయించటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయంతో పాటు.. అపాయం పొంచి ఉంటుందన్న విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అంతేకాదు.. కంపెనీ మాన్యువల్ ప్రకారం కారు ట్యాంకు ఇంధన సామర్థ్యం కంటే.. పెట్రోల్ బంకులో కొట్టే ఆయిల్ ఎక్కువ పట్టే దాని వెనుక అసలు విషయం ఉంది. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు సరి కదా.. బంకులు తమను మోసం చేస్తున్నాయని ఫీల్ అవుతుంటారు.
అసలు ఫుల్ ట్యాంక్ ఎందుకు అనొద్దు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కాస్త ఖాళీ లేకుండా ఇంధనాన్ని ట్యాంకు నిండుగా నింపేస్తే.. ట్యాంకులోని ఇంధన ఉష్ణోగ్రత పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించిన తర్వాత ట్యాంకులో కొంత స్థలం తప్పనిసరిగా ఉండాలి. ట్యాంక్ పూర్తిగా నింపేస్తే ప్రమాదానికి కారణమవుతుంది. కారు ఏదైనా దాని ట్యాంక్ ఇంధన సామర్థ్యం 50 లీటర్లు అని చెబితే.. అందులో 55 లీటర్లవరకు ఇంధనం పడుతుంది. కారణం.. భద్రతా మాన్యువల్ ప్రకారం 5 లీటరల ఖాళీ స్థలం ఉండాలన్న ఉద్దేశంతోనే.. కంపెనీలు 50 లీటర్లుగా చెబుతాయి. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు.
ఫుల్ ట్యాంక్ అని ఎందుకు అనకూడదంటే.. బంకుల్లో కొట్టే ఇంధనం.. సదరు బంకుల్లోని భూగర్భ ట్యాంకర్లలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచుతారు. ట్యాంకులో పోయగానే ఇది వేడి వాతావరణంలోకి విస్తరిస్తుంది. అలా విస్తరించినప్పుడు ట్యాంకు ఖాళీగా ఉంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లీక్ కాకుండా నిరోధిస్తుంది. దీన్నే మరో మాటలో స్పేర్ కెపాసిటీ ఎక్స్ ఫ్యాన్షన్ గా పేర్కొంటూ ఉంటారు. వాహనం ప్రయాణించే వేళలో ట్యాంకులోని ఇంధన ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఆవిరి ఉత్పత్తి అవుతుంది.దీనికి సరిపడా స్థలం అవసరం. అందుకే.. ఫుల్ ట్యాంక్ అన్న మాట వాడకూడదు. ట్యాంక్ పూర్తిగా ఇంధనంతో నింపేస్తే ప్రమాదానికి దారి తీయొచ్చు.
అంతేకాదు.. వాహనంలో పూర్తిగా ఇంధనం నింపిన తర్వాత ఎత్తులోని.. అదే సమయంలో డౌన్ లోకి నడపకుండా ఉండటం మంచిది. బంకుల్లో ఇంధనాన్ని నింపే వేళలో ఇంజిన్ ను ఆపేయటం చాలా ముఖ్యం. వాహనాన్ని వేగంగా ప్రయాణించటం.. అధిక ఉష్ణోగ్రతలు.. .ఇతర వాతావరణ పరిస్థితులతో ట్యాంకులోని ఇంధనం ఒత్తిడి గురవుతుందన్నది మర్చిపోకూడదు. అందుకే.. ఈసారి బంకుల్లోకి వెళ్లిన తర్వాత.. ఫుల్ ట్యాంక్ అన్న మాటే రావొద్దు బ్రో.