ఎట్టకేలకు కో-పైలట్ బ్యాక్ గ్రౌండ్ బయటకొచ్చింది
విమానాన్ని కూల్చేసి.. వందలాది అమాయకుల ప్రాణాల్ని గాల్లో కలపాలని ప్రయత్నించి.. ఫెయిల్ అయిన ఫ్లైదుబాయ్ కో పైలట్ ను హమామ్ అల్ హమామీగా గుర్తించారు.
ఊహకు అందని రీతిలో పైలట్ మీద సేఫ్టీ గొడ్డలితో గాయపరిచి.. విమానాన్ని నిట్టనిలువునా కూల్చేసి.. వందలాది మంది ప్రాణాల్ని గాల్లోకి కలిపే దుర్మార్గపు ప్లాన్ ను అమలు చేసేందుకు ప్రయత్నించిన ఫ్లైదుబాయ్ కో పైలట్ బ్యాక్ గ్రౌండ్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. ప్రపంచం మొత్తం షాక్ కు గురైన ఫ్లైదుబాయ్ ఉదంతంలో కీలక నిందితుడి వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. అత్యంత గోప్యంగా ఉంచిన అతడి వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. ఇతడి మైండ్ ఎంత ఛండాలంగా ఉంటుందన్న విషయాన్ని అతడి సోషల్ మీడియా ఖాతాలు.. ఇతను గతంలో జాబ్ చేసిన చోట ఇతడి వ్యవహారశైలి వివరాలు వెలుగు చూశాయి. ఇంత తేడాగాడ్ని ఫ్లైదుబాయ్ లో ఎలా జాబ్ తెచ్చుకోగలిగాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
విమానాన్ని కూల్చేసి.. వందలాది అమాయకుల ప్రాణాల్ని గాల్లో కలపాలని ప్రయత్నించి.. ఫెయిల్ అయిన ఫ్లైదుబాయ్ కో పైలట్ ను హమామ్ అల్ హమామీగా గుర్తించారు. అతి ఇస్లామిక్ భావజాలానికి ఆకర్షితుడై.. ఈ దారుణ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది.. అల్ ఖైదా నేత అల్ జవహరితో పాటు హుమామ్ ఖలీల్ అబూ ములాల్ అల్ బాలావీలను అమితంగా ఆరాధించే ఇతగాడి విపరీత పోకడలు బయటకు వచ్చాయి. ఇంతకూ ఇతడు ఏ దేశానికి చెందిన వాడన్న విషయానికి వస్తే.. తల్లి సిరియా దేశస్తురాలు కాగా.. తండ్రి ఒమన్ వాసిగా తేల్చారు. ఇతడికి ఒమన్ పౌరసత్వం ఉన్నట్లుగా గుర్తించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పుట్టిన హమామీ.. ఎక్కువకాలం యూఏఈలోనే గడిపాడు. ఇక.. ఫ్లైదుబాయ్ లో ఇతడి ఎంట్రీ కేవలం ఎనిమిది నెలల క్రితమే జరిగినట్లుగా తేల్చారు.
దీనికి ముందు ఒమన్ ప్రభుత్వ ఎయిర్ లైన్స్ ఒమన్ ఎయిర్ లో ఏడేళ్లు పని చేసిన ఇతడు.. అప్పట్లో హమామీ అతివాద మనస్తత్వాన్ని చూసి పైలట్ శిక్షణ నుంచి తప్పించి.. ఆఫీస్ పనులకే పరిమితం చేయటం గమనార్హం. దీంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. అనంతరం మొరాకో జాతీయ ఎయిర్ లైన్స్ రాయల్ ఎయిర్ మరోకాలో చేరాడు. ఇక్కడ పని చేస్తున్నప్పుడు అతివాద వీడియోలు.. ప్రసంగాలున్న వెబ్ సైట్లను తరచూ చూసేవాడని గుర్తించారు. అక్కడా మానేసి అతను ఎనిమిది నెలల క్రితం ఫ్లైదుబాయ్ లో చేరాడు.
ఇతడి వ్యవహారశైలి చూస్తే.. మరీ ఇంత తేడాగా ఉన్నాడేంటి? అనుకోకుండా ఉండలేం. మహిళా ఉద్యోగులకు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించేవాడని.. అతిగా ప్రార్థనలు చేయటం.. మత సంబంధ నియమాలను కఠినంగా ఫాలో అయ్యేవాడని చెబుతున్నారు. మహిళా ఉద్యోగులతో సరిగా మాట్లాడేవాడు కాదని గుర్తించారు. ఇతడి లింక్డిన్ ఖాతాలో అమెరికాపై విమానాలతో దాడికి పథక రచన చేసిన ఉగ్రనేత అల్ జవహరి .. బిన్ లాడెన్ తదిరత ఉగ్రవాదుల ఫోటోలను షేర్ చేశాడు. పెళ్లి విషయంలో ఇతగాడి రూల్స్ ను తెలుసుకున్న అమ్మాయిలు.. ఇతడ్ని వివాహం చేసుకోవటానికి ముందుకు రాకపోవటం గమనార్హం. తన కొడుకు పైలట్ అన్నంతనే చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ఆసక్తి చూపినా.. ఇతడి ఆలోచనలు తెలుసుకొని వెనకడుగు వేసినట్లుగా గుర్తించారు.
తనకు కాబోయే భార్య ఎప్పుడూ ముఖం కన్పించకుండా నిఖాబ్ ధరించాలని.. పెళ్లికి ముందు ఆమె ఉద్యోగం చేస్తుంటే.. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలన్న షరతు పెట్టేవాడని.. ఇవి తెలిసి చాలామంది అమ్మాయిలు ఇతడ్ని పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదని తన తల్లి బాధ పడిందన్న పోస్టు పెట్టాడు. అమ్మాయిలు ఉద్యోగం చేస్తే.. పని ప్రదేశాల్లో చెడు వాతావరణం కారణంగా చెడిపోతారన్న అర్థం వచ్చేలా పోస్టు పెట్టటం చూస్తే.. మహిళల విషయంలో ఇతగాడి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఇదంతా చూసిన తర్వాత వచ్చే సందేహం ఏమంటే.. ఫ్లైదుబాయ్ సంస్థ ఇతడ్ని ఉద్యోగంలోకి తీసుకునే సమయంలో ఇతడి సోషల్ మీడియా ఖాతాల్ని వారు సరిగా చెక్ చేయలేదా? ఇతడి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అసలు జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పుడు ఈ విషయం మీద స్పష్టం రావాల్సి ఉంది.