పాక్ అణు టెక్నాలజీ స్మగ్లింగ్‌పై అమెరికా మాజీ గూఢచారి సంచలనం!
ఏక్యూ ఖాన్ అక్రమాలను కప్పిపుచ్చేందుకు పాక్ సైన్యంలో కొన్ని ఉన్నతాధికారులు.. నేతలు అతడికి సహాయం చేశారని లాలెర్ ఆరోపించారు.;
పాకిస్థాన్ అణు కార్యక్రమానికి పితామహుడిగా పేరొందిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) అణు సాంకేతికతను ప్రపంచ దేశాలకు స్మగుల్ చేస్తున్నాడనే పాత ఆరోపణలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈసారి అమెరికా సీఐఏ మాజీ అధికారి, 'అణువ్యాప్తి నిరోధక' విభాగాన్ని నడిపిన జేమ్స్ లాలెర్ నేరుగా చేసిన వెల్లడి చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లాలెర్ చేసిన వ్యాఖ్యలు పాక్ అణు నెట్‌వర్క్‌పై ప్రపంచంలో ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.
* మృత్యు వ్యాపారి ఏక్యూ ఖాన్
జేమ్స్ లాలెర్, ఏక్యూ ఖాన్‌ను "మృత్యు వ్యాపారి"తో పోల్చారు. ఖాన్ అణు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పాక్ అధికారం అడ్డుకుని ఉండాల్సినప్పటికీ, కొందరు పాక్ జనరల్స్ మరియు నేతలు అతడి వద్ద నేరుగా జీతగాళ్లుగా పనిచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.సీఐఏ మొదటి నుంచి పాక్ అణు ప్రోగ్రామ్‌పై నిఘా ఉంచిందని లాలెర్ తెలిపారు. "మేము ఖాన్ కేవలం పాక్ కోసం సాంకేతికతను తెచ్చుకుంటాడని అనుకున్నాం. కానీ అతడు ప్రపంచ దేశాలకు అణు రహస్యాలను అమ్ముతున్నాడని గ్రహించడానికి చాలా సమయం పట్టింది" అని ఆయన వెల్లడించారు.
* ఏక్యూ ఖాన్ అందించిన అణు రహస్యాలు
ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్ ద్వారా అక్రమంగా స్మగుల్ చేయబడిన కీలక అంశాలున్నాయి. యురేనియం శుద్ధి కోసం సెంట్రిఫ్యూజ్ సాంకేతికత , బాలిస్టిక్ క్షిపణుల డిజైన్, చైనా అణు బాంబు బ్లూప్రింట్, అణ్వాయుధ తయారీకి సంబంధించిన కీలక పరికరాలు స్మగ్లింగ్ చేశాడు.
"ఇరాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఖాన్ నెట్‌వర్క్ నుంచే సహాయం పొందింది" అని లాలెర్ స్పష్టం చేశారు.
* పాక్ జనరల్స్... 'జీతగాళ్లు'
ఏక్యూ ఖాన్ అక్రమాలను కప్పిపుచ్చేందుకు పాక్ సైన్యంలో కొన్ని ఉన్నతాధికారులు.. నేతలు అతడికి సహాయం చేశారని లాలెర్ ఆరోపించారు. "అతన్ని రక్షించడానికి వారు నేరుగా అతడి వద్ద జీతగాళ్లుగా చేరి పనిచేశారు. అయితే ఇది మొత్తం పాక్ పాలసీ కాదు. కొంతమంది వ్యక్తుల దురుద్దేశం మాత్రమే" అని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు పాక్ అణు వ్యవస్థలోని లోపాలను, కొందరు అధికారుల దురాశను సూచిస్తున్నాయి.
* ముషారఫ్ కోపం: "అతన్ని చంపేస్తా!"
ఖాన్ అణు రహస్యాలు లీక్ చేస్తున్నాడని సీఐఏ గుర్తించిన తర్వాత నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఈ సమాచారాన్ని అందించింది. సీఐఏ డైరెక్టర్ జార్జ్ టెనెట్ ఈ విషయాన్ని ముషారఫ్‌కి చెప్పగానే ముషారఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని లాలెర్ గుర్తు చేసుకున్నారు. "ఖాన్‌ను చంపేస్తానంటూ అరిచాడు" అని లాలెర్ పేర్కొన్నారు. ఆ తర్వాత పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకొని, ఏక్యూ ఖాన్‌ను గృహనిర్బంధం చేసింది.
*సీఐఏ 'నకిలీ పరికరాల' వ్యూహం
అణు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను అరికట్టడానికి జేమ్స్ లాలెర్ నాయకత్వంలో సీఐఏ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసిందని ఆయన తెలిపారు. తమను తాము వ్యాపారులుగా పరిచయం చేసుకోవడం.. నకిలీ కంపెనీలను ఏర్పాటు చేయడం.. స్మగ్లర్లకు డీల్ ఉందని నమ్మించడం... అసలు పరికరాల స్థానంలో లోపాలు ఉన్న నకిలీ పరికరాలు పంపడం... ఈ వ్యూహం వల్ల పలు దేశాలు అణు సాంకేతికతను పొందడంలో భారీ అటంకాలు ఏర్పడ్డాయని లాలెర్ చెప్పారు.
* లిబియా వెనక్కు తగ్గింది
9/11 తర్వాత లిబియా అణు ప్రోగ్రామ్‌పై అమెరికాకు అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 'బీబీసీ చైనా' అనే ఓడను అడ్డుకొని, అందులో ఉన్న లక్షల సంఖ్యలో అణు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సాక్ష్యాలను లిబియా అధికారుల ఎదుట ఉంచిన తర్వాత, లిబియా తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసిందని లాలెర్ తెలిపారు.
* 'మ్యాడ్ డాగ్' లాలెర్
ఫ్రాన్స్‌లో డ్యూటీ చేస్తుండగా ఒక కుక్క దాడి చేసి, దానితో పోరాడి బయటపడ్డ సంఘటనను లాలెర్ సరదాగా గుర్తు చేసుకున్నారు. డాక్టర్లు రేబిస్ వచ్చే అవకాశముందని హెచ్చరించగా "నాకు రేబిస్ వస్తే ఎవరిని కరవాలో లిస్ట్ కూడా తయారు చేశాను" అని అన్నారు. ఈ సంఘటన నుంచే సహచరులు ఆయనను 'మ్యాడ్ డాగ్' అని పిలవడం మొదలెట్టారని తెలిపారు.