ఎవరెస్ట్ భీతావాహం.. భారీ మంచు తుఫానులో చిక్కుకున్న 1000 మంది..

ఒకప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం దరిదాపుల్లోకి చేరడం కూడా సాహసమే అనిపించేది. కఠినమైన వాతావరణం, సరైన సౌకర్యాల లేమి కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే ఆ సవాల్‌ స్వీకరించగలిగేవారు.;

Update: 2025-10-06 05:10 GMT

హిమాలయాలు.. ప్రకృతిలోని అత్యంత అద్భుతమైన సృష్టి. భగవంతుడు శివుడు కొలువై ఉన్న పవిత్ర ప్రదేశంగా భావించబడే ఈ పర్వత శ్రేణులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని తమలో ఒదిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ మహా శిఖరం వద్ద పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఒకప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం దరిదాపుల్లోకి చేరడం కూడా సాహసమే అనిపించేది. కఠినమైన వాతావరణం, సరైన సౌకర్యాల లేమి కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే ఆ సవాల్‌ స్వీకరించగలిగేవారు. కానీ గత కొన్నేళ్లుగా సాంకేతికత, పరికరాలు, మార్గదర్శక సదుపాయాలు పెరగడంతో ప్రపంచం నలుమూలల నుంచి పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు తరలివస్తున్నారు. పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది.

కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం భయాందోళనగా మారింది. ప్రస్తుతం ఎవరెస్ట్‌ పరిసర ప్రాంతం మంచు తుఫాన్ బీభత్సంతో వణికిపోతోంది. విపరీతమైన హిమపాతం కారణంగా వాతావరణం అంటార్కిటికా చలిని తలపించేలా మారిపోయింది. ఈ సమయంలోనే సుమారు వెయ్యి మంది పర్వతారోహకులు టిబెట్‌ వైపున 16 వేల అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. నిరంతర మంచు కురవడం వల్ల వారిలో చాలామంది హైపోథెర్మియాతో బాధపడుతున్నట్టు సమాచారం.

సహాయక బృందాలు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, తీవ్ర వాతావరణ పరిస్థితులు, హిమపాతం కారణంగా చర్యలు కష్టతరంగా మారాయి. స్థానిక షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నేపాల్‌లో కూడా భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రోడ్లు మూసుకుపోవడం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడం వల్ల సహాయక చర్యలు సజావుగా సాగడంలేదు.

వాతావరణ నిపుణుల ప్రకారం, ఈ మంచు తుఫాన్‌ కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరెస్ట్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్‌ 30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోందని చెబుతున్నారు. ఈ స్థితిలో పర్వతారోహకులు శ్వాసకోశ సమస్యలు, శరీర ఉష్ణోగ్రత తగ్గడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం చిక్కుకుపోయిన పర్వతారోహకులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలను, అంతర్జాతీయ సంస్థలను కోరుతున్నారు. ఇప్పటికే నేపాల్‌ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

ఎవరెస్ట్‌ శిఖరం ఎప్పటిలాగే మహిమగలదే అయినా, ఈ మంచు బీభత్సం ఆ ప్రాంతం మీద మానవ జోక్యం, వాతావరణ మార్పుల ప్రభావం ఎంత పెరిగిందో మరోసారి గుర్తు చేసింది. ప్రకృతిని జయించాలనే మనుషుల తపన, ఇప్పుడు వారికి తీవ్రమైన సవాలుగా మారింది.

Tags:    

Similar News