దువ్వాడకు డోర్స్ క్లోజ్! మూలపేట ప్రోగ్రాంతో విషయం క్లియర్!

వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ తలుపులు మూసేసినట్లేనా? అన్న చర్చ జరుగుతోంది.;

Update: 2026-03-31 11:05 GMT

వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ తలుపులు మూసేసినట్లేనా? అన్న చర్చ జరుగుతోంది. దువ్వాడ సొంత నియోజకవర్గమైన టెక్కలిలో సోమవారం వైసీపీ ‘మూలపేట చూసొద్దాం పదండి’ పేరిట భారీ కార్యక్రమం నిర్వహించింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చెబుతారు. గడిచిన మూడు దశాబ్దాలుగా కింజరాపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగుతున్న దువ్వాడను పక్కకు తప్పించి, అంతకు మించి అన్నట్లు పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా వైసీపీ సత్తా చాటిందని అంటున్నారు. ఈ పరిణామం గమనిస్తే ఎమ్మెల్సీ దువ్వాడకు వైసీపీతో పూర్తిగా తెగతెంపులు అయ్యేవరకు పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల కారణంగా ఆయనను పార్టీ నుంచి దూరంపెట్టారు. ప్రస్తుతం ఆయనను సస్పెన్షన్ లో ఉంచారే కానీ, బహిష్కరణ వేటు వేయలేదని అంటున్నారు. దీంతో ఎప్పుడైనా దువ్వాడ వైసీపీలోకి రీ ఎంట్రీ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ కూడా పార్టీ సస్పెన్షన్ వేసినా, తాను వైసీపీకి విధేయుడిగానే కొనసాగేందుకు మొగ్గుచూపారు. తనపై అధినేత జగన్మోహనరెడ్డికి లేనిపోనివి చెప్పి దూరం చేశారని చెబుతూ జగన్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అటు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత తమ్మినేనితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలకు టచ్ లో ఉంటూ కేవలం సాంకేతికంగా మాత్రమే దూరంగా ఉన్నట్లు సంకేతాలు పంపేవారు ఎమ్మెల్సీ దువ్వాడ.

కానీ, సోమవారం జరిగిన సమావేశం తీరు చూస్తే ఇక దువ్వాడకు వైసీపీకి విడాకులు అయినట్లే భావించాల్సివస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ ప్రమేయం లేకుండా భారీ కార్యక్రమం నిర్వహించి ఆ నియోజకవర్గ ప్రస్తుత సమన్వయకర్త పేడాడ తిలక్ సత్తా చాటారని అంటున్నారు. అదే సమయంలో దువ్వాడను దరి చేరనీకుండా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన సోదరులు టెక్కలిలో పట్టు పెంచుకున్నారని ఈ కార్యక్రమంతో తేలిపోయిందని అంటున్నారు. ఇదే సమయంలో దువ్వాడ భార్య వాణిని కార్యక్రమానికి పిలిచినా, ఆమెకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. దీనిద్వారా టెక్కలిలో ఇకపై మంత్రి అచ్చెన్నాయుడికి ప్రత్యర్థిగా పేడాడ తిలక్ కు పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశాలే కనిపిస్తున్నాయని అంటున్నారు.

మరోవైపు తాను అధినేత జగన్ మనసులో ఉన్నానని, సస్పెన్షన్ తాత్కాలికమే ఉంటుందని, వచ్చే ఎన్నికలకు తానే టెక్కలి అభ్యర్థి అవుతానని ఇన్నాళ్లు ఎమ్మెల్సీ దువ్వాడ చెప్పుకునే వారు. అయితే మూలపేట పోర్టు సభతో సీనియర్ నేతలు ధర్మాన సోదరులు, టెక్కలి ఇంచార్జి తిలక్ ఎమ్మెల్సీ దువ్వాడ ఆశలను చిదిమేసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వంలో మూలపేట పోర్టు నిర్మాణానికి ఎమ్మెల్సీ దువ్వాడ కొంతవరకు ప్రయత్నించారని, పోర్టు పనులలో కూడా ఆయన భాగస్వామ్యులయ్యారని ప్రచారం ఉంది. అయితే తాజా సభలో ఆ ప్రస్తావన తేకుండా పూర్తిగా అధినేత జగన్ కు మాత్రమే క్రెడిట్ దక్కేలా వైసీపీ నేతలు వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. దీనిద్వారా ఎమ్మెల్సీ దువ్వాడకు వైసీపీతో పూర్తిగా తెగతెంపులు అయినట్లేనని సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.

Tags:    

Similar News