మణుగూరులో మందుబాబు వీరంగం.. : తనిఖీ చేస్తున్న పోలీసులపై కత్తితో దాడికి యత్నం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తొగ్గెడెంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది.;

Update: 2026-05-08 10:23 GMT

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి రక్షణ కల్పించే పోలీసులపైనే కత్తితో దాడికి యత్నించడం అత్యంత బాధ్యతారాహిత్యం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేది ప్రజల భద్రత కోసమే అన్న విషయాన్ని మర్చిపోయి, ఒక సామాన్య తనిఖీని తన వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయంగా భావించి కత్తి పట్టుకొని వీరంగం సృష్టించడం విచారకరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తొగ్గెడెంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది.

మణుగూరు మండలంలోని తొగ్గెడెం గ్రామంలో బుధవారం సాయంత్రం ఒక వింత, భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర చర్చకు దారితీసింది.

అసలేం జరిగింది..?

పోలీసుల కథనం ప్రకారం ఘటన ఇలా సాగింది.. తొగ్గెడెం సమ్మక్క–సారలమ్మ దేవాలయం వద్ద పోలీసులు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం తాగి బైక్ పై వస్తుండగా పోలీసులు అతడిని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అందులో అతను మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అతడిని మందలించి పంపించివేశారు.

కత్తితో వచ్చి ‘హీరోయిజం’ పోలీసులపై దాడి యత్నం

మత్తులో ఉన్న సదరు వ్యక్తి తన ఇంటికి వెళ్లి కత్తితో తిరిగి మళ్లీ తనిఖీలు చేస్తున్న పోలీసుల వద్దకు వచ్చాడు. ‘నన్నే ఆపుతారా? నాకే టెస్టులు చేస్తారా?’ అంటూ కేకలు వేస్తూ పోలీసుల పైకి కత్తితో దూసుకెళ్లాడు. నడిరోడ్డుపై కత్తితో ఊగిపోతూ అక్కడున్న వారందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతని దాడి నుంచి తప్పించుకున్నారు.

రిమాండ్‌కు నిందితుడు

పోలీసులపై దాడికి యత్నించిన నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై హత్యాయత్నం, విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

మద్యం మత్తులో చేసే ఇలాంటి పిచ్చి పనులు చివరకు జైలు జీవితానికి దారితీస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు తనిఖీలు చేసేది ప్రమాదాలను అరికట్టడానికే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ కేసులో తనఖీలు చేసి 80 శాతం రీడింగ్ చూపించినా కూడా మొదటి తప్పుగా భావించి విడిచిపెట్టారు. సరిగ్గా ఇంటికి పడుకోకుండా.. కత్తి తీసుకొని పోలీసులపైకే రావడం చూస్తుంటే అతని వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏదో బయటపడ్డాం అని సంతోషించకుండా ఇలాంటి పని చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులనే బెదిరించే స్థాయికి వెళ్లడం క్షమించరాని నేరం.



Tags:    

Similar News