'ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం'.. ట్రంప్ లక్ష్యం నోబెల్ కన్ఫామ్..!

అవును.. ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయ్యగలిగే అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.;

Update: 2025-11-07 06:56 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమి మాట్లాడినా అందులో పైకి వినిపించే అర్ధం ఒకటి ఉంటే.. మరికొంతమందికి ధ్వనించే సౌండ్ మరొకటి ఉంటుందని అంటారు. ఈ క్రమంలో తాజాగా అణ్వాయుధాలపై అమెరికాకు ఉన్న శక్తిని వెల్లడిస్తూ రష్యా, చైనాల అధ్యక్షుల టాపిక్ ఎత్తి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అవును.. ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయ్యగలిగే అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలా అంటూనే అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌ పింగ్‌ తో చర్చించినట్లు వెల్లడించారు. అమెరికన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఇందులో భాగంగా.. అణు సామర్థ్యాలలో అమెరికాను మొదటి స్థానంలో.. రష్యా, చైనాలను తరువాత స్థానాల్లో ఉంచిన ట్రంప్.. వ్లాదిమిర్ పుతిన్, జి జిన్‌ పింగ్ వంటి నాయకులు ఇప్పుడు తమ డబ్బును ఇతర విషయాలపై ఖర్చు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా తాను మాత్రం ప్రపంచ శాంతిని కోరుకుంటున్నానని ట్రంప్ మరోసారి వెల్లడించారు.

ఈ సందర్భంగా... 'మనం నంబర్ వన్, రష్యా నంబర్ టూ, చైనా నంబర్ త్రీ, చాలా వెనుకబడి ఉన్నాయి కానీ.. నాలుగు లేదా ఐదు సంవత్సరాలలో వారు కూడా సరిసమానంగా ఉంటారు.. అయితే దీని అవసరం లేదు.. తాను పుతిన్, జిన్‌ పింగ్‌ తో దీని గురించి మాట్లాడాను అని ట్రంప్ తెలిపారు.

వాస్తవానికి మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న ఆయన.. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని.. ఈ జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉందని పేర్కొన్నారు.

కాగా.. రష్యా, చైనా రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అగ్రరాజ్యం ఆదేశాలను సమర్ధిస్తూ... అటువంటి కార్యకలాపాలు భూగర్భంలో నిర్వహించబడుతున్నాయని, అందువల్ల వాటిని గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు.

ఇలా ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయ్యగలిగే అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని.. అయినప్పటికీ.. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని.. తాను మాత్రం ప్రపంచ శాంతినే కోరుకుంటున్నానని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వెనుక "నోబెల్ శాంతి బహుమతి" కోరిక కూడా ధ్వనిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Tags:    

Similar News