కాంతుల పండుగ.. రికార్డుల మోత.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దీపావళి

ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన వ్యాపారం విలువ అక్షరాలా రూ. 6.05 లక్షల కోట్లు.. ఇది ఒక కొత్త రికార్డు.;

Update: 2025-10-22 06:53 GMT

దీపావళి అనేది కేవలం దీపాల పండుగ కాదు.. అది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసే ఉత్సవం. ఈ ఏడాది ఆ వెలుగులు మరింత ప్రకాశవంతంగా మారాయి (ఆర్థికంగా). దేశవ్యాప్తంగా సంతోషం, భక్తి, ఉత్సాహం మధ్య మోగిన ఈ పండుగ వెనుక ఒక గొప్ప ఆర్థిక కథ దాగి ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన వ్యాపారం విలువ అక్షరాలా రూ. 6.05 లక్షల కోట్లు.. ఇది ఒక కొత్త రికార్డు.

గతంలో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం అధికం..

గతేడాది దీపావళి సీజన్‌లో వ్యాపారం రూ. 4.25 లక్షల కోట్లకు పరిమితమైంది. అంటే.. ఈ ఏడాది 25 శాతం వృద్ధి నమోదైందన్న మాట. ఇది కేవలం డబ్బు గణాంకం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యాపారుల, వినియోగదారుల నమ్మకం అని సంకేతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా అనిశ్చితి దశలో ఉన్న సమయంలో భారత వినియోగ మార్కెట్‌ ఈ స్థాయికి చేరడం ఆర్థిక విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆసక్తి కర వ్యాఖ్యలు..

సీఏఐటీ (CAIT) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 87 శాతం మంది వినియోగదారులు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేశారని, ఇది భారత మార్కెట్‌లో ‘లోకల్‌ ఫస్ట్‌’ ఆలోచనకు బలమైన సంకేతమని చెప్పారు. చైనా ఉత్పత్తులపై ఆధారపడడం తగ్గి, స్వదేశీ తయారీ ఉత్పత్తులపై ప్రజలు విశ్వాసం పెంచుకోవడం ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

రికార్డు స్థాయికి పటాకలు..

ఇదే సమయంలో, ఈ ఏడాది పటాకుల అమ్మకాలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. పర్యావరణ నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ, దేశంలోని పటాకుల తయారీదారులు ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ పేరుతో కొత్త రకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంప్రదాయ ఆనందాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే ఈ పద్ధతి వ్యాపారంలో కొత్త దిశను చూపించింది.

అన్ని రంగాలకు ఊపు..

దీపావళి ఆర్థిక ప్రభావం ఒకే రంగంలో పరిమితం కాలేదు. గృహోపకరణాలు, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, ఆటోలు, మొబైల్‌ ఫోన్లు, గిఫ్ట్స్‌, పూజా సామగ్రి ప్రతి విభాగంలో వ్యాపారం పెరిగింది. ఆన్‌లైన్‌ మార్కెట్‌ కూడా ఈ పండుగను వేడుకగా మార్చింది. చిన్న వ్యాపారులు, స్థానిక బజార్లు, హస్తకళల వ్యాపారులు వీరందరికీ ఈ దీపావళి ప్రత్యేకమైన వెలుగు తెచ్చిందనే చెప్పాలి.

చిన్న పట్టణాలు సైతం సంతోషంగా..

దేశంలోని పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లూ ఈ సారి ఉత్సాహంతో కళకళలాడాయి. డిజిటల్‌ పేమెంట్లు పెరిగాయి, ఆన్‌లైన్‌ డెలివరీలు ఎక్కువయ్యాయి. పండుగ సమయంలో యూపీఐ లావాదేవీలు 10 బిలియన్‌ మార్క్‌ను దాటినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మార్పు ‘డిజిటల్‌ భారత్‌’ సంకల్పానికి కొత్త శక్తి ఇచ్చింది.

తగ్గిన చైనా ఉత్పత్తులు..

చైనా ఉత్పత్తుల డిమాండ్‌ తగ్గిపోవడం ఈ దీపావళి ప్రత్యేకతగా నిలిచింది. గతంలో పండుగ సమయంలో మార్కెట్లలో చైనా తయారీ లైట్లు, డెకరేషన్‌ వస్తువులు, పటాకులు, టాయ్స్‌ ఆధిపత్యం చూపేవి. కానీ ఈసారి భారత మార్కెట్‌ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే నినాదాన్ని ఆచరణలో చూపించింది. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం కేవలం ఆర్థిక చర్య కాదు. అది భావోద్వేగం, దేశభక్తికి నిదర్శనం.

ఆర్థిక పండుగగా మారింది..

సీఏఐటీ నివేదికలో ఒక కీలక అంశం ఉంది. ‘ఈ దీపావళి కేవలం వ్యాపార పండుగ కాదు, ఇది ఆర్థిక ఆత్మవిశ్వాసం పునరాగమనం.’ మహమ్మారి, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లతో కూడిన కాలంలో కూడా భారత ప్రజలు తమ ఉత్సాహాన్ని కోల్పోలేదు. ప్రతి దీపం వెలిగేటప్పుడు కేవలం ఆ దేవతలే కాదు, ఆ దేశ ఆర్థిక శక్తి కూడా వెలుగులోకి వచ్చింది. దీపావళి వ్యాపార రికార్డులు మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతున్నాయి. భారత మార్కెట్‌ ఇక ప్రపంచ మార్కెట్‌లతో పోటీ పడగలదు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కేవలం ఒక స్లోగన్‌ కాదు.. అది వినియోగదారుల మానసికతగా మారింది.

ఈ దీపావళి మన ఇళ్లలో వెలుగులు పంచడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక కొత్త దీపం వెలిగించింది. అది స్వదేశీ నమ్మకం, స్వయంపోషణ, మరియు ఆత్మవిశ్వాసం.

Tags:    

Similar News