విమానయాన రంగంలో మరో కలకలం

విమానయానంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అయితే, భద్రత పేరిట అనవసరమైన ఒత్తిడిని పైలట్లపై మోపడం వల్ల అందుబాటులో ఉన్న మానవ వనరులు తగ్గిపోవచ్చు.;

Update: 2025-07-08 01:30 GMT

భారత విమానయాన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వాణిజ్య విమానాలను నడిపే పైలట్ల వైద్య పరీక్షలకు సంబంధించి తాజాగా జారీ చేసిన నిబంధనలు విమానయాన సంస్థలతోపాటు పైలట్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కొత్త ఆదేశాలు విమానయాన రంగంలో అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి.

-ఐఏఎఫ్ బోర్డింగ్ సెంటర్లలోనే తప్పనిసరి వైద్య పరీక్షలు

తాజా డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఇకపై వాణిజ్య పైలట్లు తమ వార్షిక వైద్య పరీక్షలను ప్రైవేటు ఆసుపత్రుల్లో కాకుండా కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) బోర్డింగ్ సెంటర్లలోనే చేయించుకోవాలి. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కేంద్రాలపై ఆధారపడే పైలట్లకు, సంస్థలకు శ్రమ, వ్యయం, సమయం ఈ మూడు అంశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని విమానయాన సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

- పైలట్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం

ఇప్పటికే దేశంలో పైలట్ల కొరత ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ఈ కొత్త వైద్య నిబంధనలు మరిన్ని పైలట్లు విధులకు అందుబాటులో ఉండకుండా చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిలిటరీ స్థాయి వైద్య ప్రమాణాలు వాణిజ్య పైలట్లకు వర్తింపజేయడం అన్యాయమని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. ఆ పరీక్షల్లో అనేక మంది పైలట్లు వైద్యపరంగా అనర్హులుగా ప్రకటించబడే ప్రమాదం ఉండటంతో ఈ చర్యలు విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.

- పరిమిత IAF కేంద్రాలు.. సమయ, రవాణా సవాళ్లు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా IAF బోర్డింగ్ సెంటర్లు కేవలం మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ, జోర్హాట్, బెంగళూరు. దూర ప్రాంతాల పైలట్లు ఈ కేంద్రాలకు ప్రయాణించి పరీక్షల కోసం అపాయింట్‌మెంట్లు తీసుకోవాల్సి రావడం వల్ల వారిపై సమయపరమైన ఒత్తిడి ఖర్చు పెరుగుతాయి. ఇది విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలపై దెబ్బతీసే అంశమని ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA India) ఆందోళన వ్యక్తంచేసింది.

- ఇటీవల జరిగిన ప్రమాదాలతో డీజీసీఏ చర్యల నేపథ్యం

ఈ కఠిన నిర్ణయాలకు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నేపథ్యంగా నిలిచాయి. జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. 242 మందితో ప్రయాణిస్తున్న ఆ విమానంలో కేవలం ఒక్కరే ప్రాణాలతో బయటపడటం, పైగా ఇటీవల ఓ పైలట్ విధుల్లో ఉండగానే కార్డియాక్ అరెస్ట్‌కు గురై విమాన టేకాఫ్ ఆలస్యమవడం వంటి సంఘటనలు డీజీసీఏను మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశాయి.

- సరైన సమతౌల్యం అవసరం

విమానయానంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అయితే, భద్రత పేరిట అనవసరమైన ఒత్తిడిని పైలట్లపై మోపడం వల్ల అందుబాటులో ఉన్న మానవ వనరులు తగ్గిపోవచ్చు. వైద్య ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో సరైన సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ప్రయాణికుల భద్రతకు అనువైన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు పైలట్లను కూడా కార్యనిర్వహణకు అనుకూలంగా ఉంచే విధానాలు అవలంభించాల్సిన అవసరం ఉందని విమానయాన పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News