దేశానికి కొత్త టెన్షన్: కొత్త తరం తగ్గుతోంది

ఇప్పటివరకు యంగ్ ఇండియా పేరుతో ప్రపంచంలోని మిగిలిన దేశాలకు భిన్నంగా ఉన్న భారతదేశానికి కొత్త తలనొప్పి మొదలైనట్లే.;

Update: 2025-09-05 06:30 GMT

ఇప్పటివరకు యంగ్ ఇండియా పేరుతో ప్రపంచంలోని మిగిలిన దేశాలకు భిన్నంగా ఉన్న భారతదేశానికి కొత్త తలనొప్పి మొదలైనట్లే. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్ఫుటమవుతున్న జనాభావ్రద్ధి తిరోగమనం భారత్ లోనూ మొదలు కానున్నట్లుగా తాజాగా విడుదలైన రిపోర్టు స్పష్టం చేస్తోంది. యువ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్ లో వీరి సంఖ్య తగ్గిపోతుందని.. వయోధికులు ఎక్కువ అవుతున్న విషయాన్ని ప్రస్తావించింది.

దీంతో కొత్త ఇబ్బందులకు దేశం సిద్ధం కావాల్సి ఉంటుంది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.9కి తగ్గిపోయిన వైనాన్ని కేంద్ర జన గణన విభాగం విడుదల చేసిన తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం రిపోర్టు 2025 ప్రకారం దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 కంటే తక్కువగా నమోదు కావటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. ఇదేరీతిలో క్షీణత నమోదైన పక్షంలో జనాభా తగ్గుదలకు దారి తీస్తుందని చెబుతున్నారు

అదే జరిగితే పెద్ద వయస్కుల వైపు దేశం పయనించటం పక్కా అవుతుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి 2.1 కాగా పట్టణ ప్రాంతాల్లో 1.5కే పరిమితమైంది. ప్రస్తుతం సంతానోత్పత్తి అత్యధికంగా బిహార్ లో 2.8గా ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్.. జార్ఖండ్.. అసోం రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 లోపునకు పడిపోవటం గమనార్హం.

ఢిల్లీ రాష్ట్రంలో ఇది అతి తక్కువగా (1.2)నమోదైంది. తమిళనాడు (1.3).. పశ్చిమబెంగాల్ (1.3).. మహారాష్ట్ర (1.4)లో నమోదైతే.. తెలుగు రాష్ట్రాలతోపాటు జమ్ముకశ్మీర్.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో మాత్రం 1.5గాఉంది. 1985లో సంతానోత్పత్తి 4.3 శాతం అయితే.. ప్రస్తుతం ఇది 1.9 శాతానికి పడిపోవటం గమనార్హం. ప్రస్తుత నివేదికప్రకారం చూసినప్పుడు జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో యుక్త వయస్కులు తక్కువగా.. వయోజనులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రూపుల వయసు మధ్య అంతరం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఏపీతో పోలిస్తే తెలంగాణలో 0-14 ఏళ్ల లోపు వారు స్వల్పంగా ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో 60 ఏళ్లకు పైబడిన వారు ఏపీలో 10.6 గా ఉంటే తెలంగాణలో 9.1గా ఉంది. జాతీయ సగటు 9.7గా ఉంది. ఈ లెక్కన చూస్తే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే యుక్త వయస్కులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాలి. యువత తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మానవవనరుల కొరత ఏర్పడుతుంది. ఉత్పాదకత తగ్గి..ఆర్థిక వ్రద్ధి నెమ్మదిస్తుంది. పెద్ద వయస్కులు పెరిగే కొద్దీ పింఛను.. ఆరోగ్య.. సంక్షేమ రంగాలపై ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని దేశాల్లో జనాభా తిరోగమన దశలోకి వెళ్లిపోవటంతో అక్కడ ఆర్థిక మందగమనం కనిపించటం తెలిసిందే. ఇప్పుడు మన దేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్న అంశాన్ని తాజా రిపోర్టు వెల్లడించింది.

Tags:    

Similar News