ఏఐ విప్లవం: సాఫ్ట్‌వేర్ రంగంలో మారుతున్న సమీకరణాలు.. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు?
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.;
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పురోగతితో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ భద్రత అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ నిపుణుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కాలం చెల్లిందా?
అమోడై అభిప్రాయం ప్రకారం.. రాబోయే రోజుల్లో ఎంట్రీ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అన్ని పనులను స్వయంగా చేయలేకపోయినా ప్రాథమిక స్థాయి కోడింగ్, బగ్ ఫిక్సింగ్, టెస్టింగ్ వంటి పనులను మానవుల కంటే వేగంగా అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తోంది. దీనివల్ల కంపెనీలు భారీ సంఖ్యలో ఫ్రెషర్లను లేదా ప్రాథమిక స్థాయి ఇంజనీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన హెచ్చరించారు. కేవలం కోడింగ్ మాత్రమే తెలిసిన వారి కంటే ఏఐ సాధనాలను సమర్థవంతంగా వినియోగించుకునే వారికి మాత్రమే భవిష్యత్తు ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.
వైరుధ్యాలు.. వాస్తవాలు
అమోడై ఒకవైపు ఉద్యోగాల కోత గురించి హెచ్చరిస్తుండగా ఆశ్చర్యకరంగా ఆయన నేతృత్వంలోని ఆంథ్రోపిక్ సంస్థే సుమారు 429 కొత్త సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. ఇది ఒక రకమైన వైరుధ్యాన్ని సూచిస్తున్నట్లు అనిపించినా దీని వెనుక ఒక లోతైన అర్థం ఉంది."ఏఐ సాంకేతికత పునరావృతమయ్యే పనులను భర్తీ చేయగలదు కానీ క్లిష్టమైన సమస్యల పరిష్కారం , వ్యవస్థల రూపకల్పన, సృజనాత్మక ఆలోచనల్లో మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదు అని పేర్కొంటున్నారు. అందుకే కంపెనీలకు కేవలం కోడర్లు కాకుండా టెక్నాలజీని లీడ్ చేయగల నిపుణుల అవసరం పెరిగింది.
మారుతున్న ఉద్యోగ స్వభావం
గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు ఏఐ విభాగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఉద్యోగాల అంతం కాదు.. కేవలం 'ఉద్యోగ స్వభావంలో మార్పు' మాత్రమే. ఏఐ ప్రాబల్యంతో దీని ప్రాధాన్యత తగ్గుతోంది.ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయడం.. వాటిని మేనేజ్ చేయడం వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. డొమైన్ నైపుణ్యంతో పాటు ఏఐ సాధనాలపై పట్టు సాధించడం ఇప్పుడు అనివార్యం.
ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం
మానవ వనరుల ప్రాధాన్యతను తగ్గించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో ఉపాధి కోల్పోతే, ప్రజల వినియోగ శక్తి తగ్గి తద్వారా గ్లోబల్ మార్కెట్లు కుదేలయ్యే ప్రమాదం ఉంది. అందుకే టెక్నాలజీ అభివృద్ధి , మానవ ఉపాధి మధ్య ఒక సమతుల్యత ఉండాలని వారు సూచిస్తున్నారు.
అప్‌స్కిల్లింగ్ మాత్రమే మార్గం
ఏఐ విప్లవం సాఫ్ట్‌వేర్ రంగాన్ని సమూలంగా మారుస్తున్న మాట వాస్తవం. అయితే చరిత్రలో ప్రతి పారిశ్రామిక విప్లవం పాత ఉద్యోగాలను తొలగించి కొత్త అవకాశాలను సృష్టించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు భవిష్యత్తులో రాణించాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఒక్కటే మార్గం. ఏఐని ఒక ప్రత్యర్థిగా కాకుండా ఒక శక్తివంతమైన సాధనంగా మలుచుకున్న వారికే ఐటీ రంగంలో సుస్థిర భవిష్యత్తు ఉంటుంది.