డీఎంకే విషయం కాంగ్రెస్ తప్పు చేసిందా?

ఇక.. దశాబ్దాల తరబడి సాగుతున్న స్నేహాన్ని పక్కన పెట్టేసి.. విజయ్ తో కలవటాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది.;

Update: 2026-05-09 04:49 GMT

రాజకీయాల్లో మార్పు అనివార్యం. అంతేనా.. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత స్నేహితులు ఎవరూ ఉండరు. ఎవరికి వారు తమ రాజకీయ అవసరాలకు తగినట్లే వ్యవహరిస్తుంటారు. అదేమీ తప్పు కాదు. అందుకు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. దశాబ్దాల తరబడి డీఎంకేతో ఉన్న మిత్రత్వాన్ని పక్కన పెట్టేసి.. అధికారానికి దగ్గరగా ఉన్న విజయ్ కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తీరుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తన బుద్ధిని చూపించిందని.. సరైన సమయాన్ని చూసి తన దారి తాను చూసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక.. దశాబ్దాల తరబడి సాగుతున్న స్నేహాన్ని పక్కన పెట్టేసి.. విజయ్ తో కలవటాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. తమతో స్నేహహస్తాన్ని వదిలేసిన హస్తం పార్టీపై పార్టీ చీఫ్ స్టాలిన్ సైతం సీరియస్ కావటం తెలిసిందే. కాంగ్రెస్ తో కలిసి చట్టసభలో పక్కపక్కనే కూర్చోవటానికి కూడా తమకు నచ్చలేదని.. తమకు వేరే వరుసలో కూర్చునేలా అనుమతి ఇవ్వాలని లోక్ సభ స్పీకర్ కు డీఎంకే నేత లేఖ రాయటం చూస్తే.. కాంగ్రెస్ తాజా నిర్ణయం డీఎంకును ఎంతటి ఆగ్రహానికి గురి చేసిందన్న విషయం అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మేజిక్ ఫిగర్ కు కేవలం పది మంది ఎమ్మెల్యేల దూరంలో ఉన్న విజయ్ కు.. కాంగ్రెస్ తనకున్న ఐదుగురు ఎమ్మెల్యేలను విజయ్ పార్టీకి మద్దతు ఇస్తారని ప్రకటించటం ద్వారా కొత్త స్నేహానికి తెర తీసింది. విజయ్ పార్టీకి వచ్చిన 108 స్థానాల తర్వాత డీఎంకే.. అన్నాడీఎంకేలను మినహాయిస్తే.. మిగిలిన పార్టీలకు దక్కిన సీట్లు ఒకట్రెండు స్థానాలే. వాటితో చూస్తే.. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకమనే చెప్పాలి.

విజయ్ కు తమ మద్దతును ప్రకటించటం ద్వారా కాంగ్రెస్ తప్పు చేసిందా? అన్నది ప్రశ్న. భవిష్యత్తు అవసరాల్ని పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ తెలివైన పని చేసిందనే చెప్పాలి. తాజా నిర్ణయంతో తన చిరకాల మిత్రుడు డీఎంకేకు కాంగ్రెస్ ఎందుకు హ్యాండిచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తమిళ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి తెర తీశారు విజయ్. అతడి తీరు చూస్తే.. ఇవాళ వచ్చి రేపు.. ఎల్లండో వెళ్లిపోయేలా లేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగే వీలుంది. దీనికి తోడు స్టాలిన్ తర్వాత డీఎంకే భవిష్యత్తు ఏమిటన్న దానిపైనా పలు సందేహాలు ఉన్నాయి.

అన్నాడీఎంకేతో మొదట్నించి దూరంగా ఉంటున్నదే. ఇలాంటి వేళలో కొత్తగా రాజకీయాల్లోకి రావటం.. వచ్చి రావటంతోనే సంచలనానికి తెర తీయటం చూస్తే.. రానున్న రోజుల్లో విజయ్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పక తప్పదు. సినీ నటుడిగా ఇంతకాలం వ్యవహరించిన విజయ్.. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పాలనతో తన మార్క్ చూపించి.. గత పార్టీల ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తే.. విజయ్ రాజకీయ భవిష్యత్తుకు తిరుగు ఉండదు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సరైన సమయంలో సరైన మిత్రుడి సహకారంతో తాను మరింత బలపడేందుకు అవకాశం దక్కుతుందని చెప్పాలి.

Tags:    

Similar News