కాంగ్రెస్‌లో మంట: ముందే నవీన్‌ను ఖరారు చేసి.. తర్వాత ప్రకటించారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే.. దీనిపై పార్టీలో అంతర్గత రాజకీయాలు ముసురుకున్నాయి.;
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే.. దీనిపై పార్టీలో అంతర్గత రాజకీయాలు ముసురుకున్నాయి. ఇన్నాళ్లుగా నాన్చి నాన్చి.. బుధవారం రాత్రి ప్రక టించిన అభ్యర్థి విషయంలో సీనియర్ నాయకుల నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థుల వరకు భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి.. తర్వాత.. ప్రకటించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి కొన్ని ఆధారాలను కూడా సీనియర్లు చెబుతుండడం గమనార్హం.
వాస్తవానికి జూబ్లీహిల్స్ టికెట్‌ను హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజనీకుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, నవీన్ యాదవ్ లు ఆశించారు. దీనిపై పార్టీ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించింది. వీరికి సంబంధించిన వివరాలు.. పార్టీలో వారు ఎప్పటి నుంచి ఉంటున్నారు. ఏయే రూపాల్లో పార్టీకి సేవలు అందిస్తున్నారు వంటి కీలక వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలిపారు.
దీంతో ఈ నలుగురు నేతల నుంచి ఒకరిని పార్టీ అధిష్టానం ఖరారు చేయనుందన్న వార్తలు వచ్చాయి. అయితే... అసలు అభ్యర్థిని అప్పటికే ఖరారు చేసేశారని.. ఇది కేవలం పార్టీ నాయకులను ఊరడించేందుకు చేసిన ప్రయత్నమని ఇప్పుడు బలమైన వాదన తెరమీదికి వచ్చింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. వీటి ప్రకారం.. తాజాగా పార్టీ ఖరారు చేసిన నవీన్ యాదవ్ వ్యవహారం.. ముందు నుంచి కూడా ఖరారు చేసేశారని అంటున్నారు.
సందేహిస్తున్నది ఇందుకే!
1) కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక దశలోనే ఉందని భావిస్తున్న సమయంలోనే నవీన్ యాదవ్..జూబ్లీహిల్స్‌లో యాక్టివ్ అయ్యారు.
2) మూడు రోజుల కిందటే.. జూబ్లీహిల్స్‌లో ఓటర్లకు ఆయన ఐడీ కార్డులు పంచారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదులు కూడా చేశారు.
3) తనపై ఫిర్యాదులు వచ్చినా.. కూడా నవీన్ ఎక్కడా వెనక్కి తగ్గకపోగా.. ఆ మరుసటి రోజు తన సొంత నిధులతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇది మరింతగా అనుమానాలకు తావిచ్చింది.
4) సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడన్న పేరుంది. దీంతో ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీనియర్లు.. జూబ్లీహిల్స్‌లో ముందుగానే నవీన్‌కు టికెట్ ఖరారు చేశారని, కానీ, అధిష్టానం.. నలుగురి పేర్లతో నివేదిక అంటూ.. గత వారం రోజులుగా పార్టీ నేతలు.. డ్రామాకు తెరదీశారని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపై పార్టీ చీఫ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా.. నవీన్ వ్యవహారం.. కీలక సమయంలో రచ్చగా మారుతుండడం వాస్తవం.