వైసీపీ నో...కాంగ్రెస్ ఎస్...ఏపీలో కొత్త రాజకీయం !
కోస్తా జిల్లాలలో అయితే అమరావతి రాజధాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది 2024 ఎన్నికల్లో చూస్తే వైసీపీకి ఇక్కడ ఒక్క సీటూ దక్కలేదు మొత్తానికి మొత్తం కూటమి పార్టీలు ఊడ్చేశాయి.;
వైసీపీ చతికిలపడిన చోటనే కాంగ్రెస్ లేస్తుంది. వైసీపీ తప్పుల తడకల నుంచే కాంగ్రెస్ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. వైసీపీని దూషించడం వల్ల అది అయ్యే పని కాదు, విధానపరంగా వైసీపీని ఎదుర్కొంటేనే కాంగ్రెస్ కి మేలు జరుగుతుంది. రాజకీయంగా పోయిన చోటనే వెతుక్కోవాలని అంటారు ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీకి మళ్ళింది. కాంగ్రెస్ ని అభిమానించే సెక్షన్లు కూడా వైసీపీ గూటికి చేరాయి. దాంతో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. వరసగా మూడు ఎన్నికల్లో దెబ్బతినిపోయింది. డిపాజిట్లకు కూడా ఠికానా లేని పరిస్థితి ఏర్పడింది.
ఘోర ఓటమితో :
అయితే వైసీపీ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతూ 2019 నాటికి ఏకంగా 50 శాతం ఓటు షేర్ తో పీక్స్ కి చేరుకుంది. అలా ఆకాశమార్గాన వైసీపీ విహరిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ అయితే పాతాళానికి కృంగిపోయి ఉంది. అయితే కాలమెప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి వైసీపీ రెక్కలు తెగి 2024 ఎన్నికల్లో పూర్తిగా నేల మీదకు చేరింది. ఇదే అదనుగా వైసీపీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ చూస్తూ వస్తోంది అయితే పీసీసీ చీఫ్ గా వైఎస్ జగన్ సోదరి ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడ వైసీపీ లోపాలు ఉన్నాయో వాటిని ఒడిసిపట్టి జనాలకు తమకు దూరమైన సెక్షన్లను తిప్పుకునే నైపుణ్యం అయితే ఏపీ కాంగ్రెస్ చూపించలేకపోతోంది.
సెంటిమెంట్ అంశంతోనే :
ఇదిలా ఉంటే అమరావతి రాజధాని అన్నది సెంటిమెంట్ అంశంగా ఉంది. ఈ అంశం మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేసింది కూటమి ప్రభుత్వం. దానికి వైసీపీ గైర్ హాజరు అయింది. ఇక పార్లమెంట్ లో సైతం వాకౌట్ చేసింది దాంతో అమరావతికి తాము అనుకూలం అంటూనే వైసీపీ ఈ విధంగా వ్యవహరించడం మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరమే అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ చాలా హుందాగా వ్యవహరించింది. ఆ పార్టీ తరఫున లోక్ సభలో మాట్లాడిన ఎంపీ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ అయితే ప్రత్యేక హోదా విభజన హామీలను కేంద్రానికి గుర్తు చేశారు. అదే సమయంలో అమరావతి రాజధానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
కోస్తాలో లేస్తుందా :
కోస్తా జిల్లాలలో అయితే అమరావతి రాజధాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది 2024 ఎన్నికల్లో చూస్తే వైసీపీకి ఇక్కడ ఒక్క సీటూ దక్కలేదు మొత్తానికి మొత్తం కూటమి పార్టీలు ఊడ్చేశాయి. దానికి కారణం రాజధాని విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు కూడా వైసీపీ అదే రకమైన గందరగళంలో ఉందని అంటున్నారు. అయితే అమరావతి రాజధానికి అవుట్ రేట్ గా మద్దతు ప్రకటించి కాంగ్రెస్ వైసీపీని వెనక్కి నెట్టింది. ఈ పరిణామమే ఇపుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.
ప్రత్యర్థులుగా ఉన్నా :
నిజానికి చూస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అయితే బీజేపీని ఇదే అదనుగా ఇరుకున పెట్టవచ్చు, కానీ కాంగ్రెస్ మాత్రం ఏపీ గురించి ఆలోచించింది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు తమ రాజకీయ వ్యూహాలను సరిగ్గా ఇక్కడే అమలు చేసింది. ఇప్పటికే విభజన పాపాలను మోస్తున్న ఆ పార్టీ ఇపుడు వాటిని కడుక్కునే ప్రయత్నం చేసింది. మూడు ఎన్నికల్లో వరసగా ఎటూ జనాలు కాంగ్రెస్ ని శిక్షించారు.
అది వైసీపీకి షాక్ :
ఇపుడు మరో కీలక సెంటిమెంట్ రాజధాని విషయంలో అయినా జనాల మనసు గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. అయితే ఏపీలో టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ మాత్రం ఈ విషయంలో రాజకీయంగానే ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో రేపటి రోజున వైసీపీ వీక్ అయిన చోట కాంగ్రెస్ బలపడేందుకు ఎంతవరకూ అవకాశాలు ఉంటాయన్న చర్చకు తెర లేస్తోంది. చిన్న నియోజకవర్గాలు ఎక్కువ సీట్లు 2029 నాటికి అవుతున్న వేళ కాంగ్రెస్ ఈ తరహా వ్యూహాలతో ముందుకు వస్తే కనుక అది వైసీపీకి షాక్ ఇచ్చినా ఇవ్వవచ్చు అని అంటున్నారు.