మనస్పర్ధలకు మంచి కాఫీ చిట్కా.. తెలుసుకోవాల్సిందే!

ఇటీవల కాలంలో దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు సైతం సద్దుమణగకుండా పెద్ద పెద్ద పరిస్థితులకు దారి తీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.;

Update: 2025-12-30 03:30 GMT

ఇటీవల కాలంలో దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు సైతం సద్దుమణగకుండా పెద్ద పెద్ద పరిస్థితులకు దారి తీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఏటా పెరుగుతున్న విడాకుల కేసులు ఈ స్టేట్ మెంట్స్ కి బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. విభిన్న మనసులున్న ఇద్దరు వివాహ బంధంతో ఏకశరీరులుగా మారి బ్రతుకుతున్న వేళ.. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద అగాధాలు ఎందుకు ఏర్పడతాయో చాలా మందికి అర్ధం కాదు! అందుకు కారణం.. ఈగో అనేవారూ లేకపోలేదు! దానికీ పరిష్కారం లేకపోలేదు!

అవును... దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు, గిల్లి కజ్జాలు సహజం. ఇద్దరూ వేరు వేరు కుటుంబాల నుంచి.. వేరు వేరు నేపథ్యాల నుంచి.. వేరు వేరు పరిస్థితుల నుంచి.. వేరు వేరు పెంపకాల నుంచి.. వేరు వేరు అనుభవాలతో.. వేరు వేరు ఆలోచనా విధానంతో వివాహం అనే బంధంతో ఏకశరీరులుగా మారతారు. రెండు హృదయాలు.. రెండు విభిన్న దృక్పథాలు.. అయినప్పటికీ "ప్రేమ" అనే దారానికి గుచ్చబడిన పూలుగా అతుక్కుని ఒక్కటిగా ఉంటారు!

ఈ క్రమంలో అప్పుడప్పుడూ చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న మనస్పర్థలూ, గిల్లికజ్జాలు రావడం సహజం. గిల్లికజ్జాలు కూడా సంసారంలోనే కాదు, వారి మధ్య శృంగారంలోనూ ఓ భాగమనే వారూ లేకపోలేదు! పైగా.. అసలు ఆ మాత్రం చిన్న చిన్న అలకలు, బుజ్జగింపులు, గిల్లి కజ్జాలు లేకపోతే సంసారం మరీ చప్పగా ఉంటుందనీ చెబుతుంటారు. అయితే.. ఇవన్నీ సరదాగా, సరసంగా ఉండాలే తప్ప.. చినికి చినికి గాలివానగా మారి ఈగోలకు పోకూడదని అంటుంటారు.

ఒక దారానికి గుచ్చిన రెండు పువ్వుల మధ్య ఈగో ఏమిటి అసలు? ఒక వేళ నిజంగా ఇద్దరిలో ఒకరికి కాస్త కోపం, కాస్త ఈగో ఎక్కువ అయితే.. మరొకరు కాస్త తగ్గాలి. తగ్గితే తప్పేముంది..? ఆ సమయంలో భాగస్వామి అలకపానుపును దించాలి.. ఈగోనూ కూల్ చేయాలి! ఆ తర్వాత వారికే తెలుస్తుంది.. తాను ఎంత మంచి పార్టనర్ ముందు పనికిమాలిన ఈగోకి పోయానో అని! మనసుంటే మార్గం ఉంటుంది కదా..!!

ఈ క్రమంలో... చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న దంపతుల మధ్య ఆ చిన్న గ్యాప్ ను దూరం చేసే విషయంలో.. చల్లని సాయంత్రం పూట ఇద్దరూ కూర్చుని తాగే వెచ్చని ఓ కప్పు కాఫీ చాలా పెద్ద పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు, సంసార జీవీతాన్ని చదివి ఒడబోసిన అనుభవజ్ఞులు! ఆ సమయంలో ఇద్దరిలో కాస్త ఎక్కువ కోపంగా ఉన్నవారు ఒంటరిగా కూర్చుని ఉంటే.. వారి భాగస్వామి వేడి వేడి కాఫీ పట్టుకుని వెళ్లి.. పక్కనో, ఎదురుగానో కూర్చుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అని చెబుతున్నారు.

ఎదురెదురుగా ఉన్నప్పుడు ఒకరి కాళ్లు ఒకరికి తగలకపోయినా.. పక్కపక్కనే ఉన్నప్పుడు భుజాలు రాసుకోకపోయినా.. మనసుల మధ్య ఉన్న గ్యాప్ మాత్రం ఆ వేడి కాఫీ సమక్షంలో ఆవిరైపోతుందని చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో.. ఓ జంట విషయంలో స్పందించిన సుప్రీంకోర్టు.. "కలిసి ఒక కప్పు కాఫీ తాగితే చాలా జరగొచ్చు" అని వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే! మీకూ ఈ సమస్య ఉంటే... ఒక సారి ఈ కప్పు కాఫీ చిట్కాని పాటించి చూడండి!!

Tags:    

Similar News