వదులుకున్న నియోజకవర్గంలో విజయ్ మాస్ స్పీచ్
కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలకి దిగి, తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్ఠించాడు విజయ్.
కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలకి దిగి, తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్ఠించాడు విజయ్. సీఎం అయ్యాక మూడు వారాల పాటు ఎక్కువగా సీఎంవోలోనే ఉంటూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, అతిథులను కలుస్తూ తీరిక లేకుండా గడిపిన విజయ్.. తొలిసారిగా ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అది తాను ఎమ్మెల్యేగా రెండో నియోజకవర్గం తిరుచిరాపల్లిలో కావడం విశేషం.
పెరంబూర్‌లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విజయ్, తిరుచిరాపల్లిలో రాజీనామా చేశారు. ఐతే తన మీద నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గంలోనే సీఎం అయ్యా తన తొలి సభనుపెట్టి అక్కడి జనాలకు తన కృతజ్ఞతను చూపించాలనుకున్నారు విజయ్. అంతే కాక ఇక్కడ బరిలోకి దించే కొత్త అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉన్న నేపథ్యంలో విజయ్ ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, కార్యకర్తల్లో చురుకుపుట్టించేలా అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.
తన రాజకీయ ప్రత్యర్థులపై విజయ్ వేసిన పంచ్‌లు ఈ సభలో హైలైట్‌గా నిలిచాయి. తమ టీవీకే పార్టీకి జనం మోసపోయి ఓట్లు వేశారంటూ డీఎంకే, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను విజయ్ తిప్పికొట్టారు. ఇన్నేళ్లుగా వారికి జనం ఓట్లు వేస్తున్నారని, అప్పుడు ప్రజలు మంచివాళ్లని.. కానీ తన పార్టీకి ఓటు వేస్తే మాత్రం చెడ్డవాళ్లు, ఫూల్స్ అయిపోయారని విజయ్ ఎద్దేవా చేశారు. టీవీకేకు ఓటు వేసిన జనాలను తక్కువ చేసి మాట్లాడితే తాను ఊరుకోనని విజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నా నోట్లో బాగా వచ్చేస్తుంది అంటూ విజయ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్, విజయ్ కాంత్ అన్న అంటూ దివంగత నటుడిని తలుచుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఇక 1977లో ఎంజీఆర్ ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే పార్టీ సాధించిన దాని కంటే తన పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయం గుర్తు చేస్తూ జనం తనపై పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్స్ చెప్పాడు విజయ్. అలా అని తాను ఎంజీఆర్‌తో పోల్చుకోవడం లేదని.. ఎంజీఆర్ ఎంజీఆరే అని విజయ్ వ్యాఖ్యానించాడు. ఇంకొంచెం ఎక్కువ ప్రేమను ఇచ్చి ఉంటే బాగుండేదంటూ తనకు అవసరమైన మెజారిటీ రాకపోవడాన్ని ప్రస్తావించాడు విజయ్. కానీ వచ్చే ఎన్నికల్లో జనం నుంచి మరింత ప్రేమను సంపాదించి ఇంకా ఘనవిజయం సాధించగలననే నమ్మకం తనకుందని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు.