పరకామణి కేసులో కీలక పరిణామం.. ధర్మారెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు?

టీటీడీ పరకామణిలో చోరీ కేసు రాజీపై సీఐడీ అధికారుల దర్యాప్తులో వేగం పెరిగింది.;

Update: 2025-11-27 14:30 GMT

టీటీడీ పరకామణిలో చోరీ కేసు రాజీపై సీఐడీ అధికారుల దర్యాప్తులో వేగం పెరిగింది. వచ్చేనెల 2వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సివుండటంతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు కేసుపై పూర్తిగా ఫోకస్ చేశాయి. తాజాగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డితోపాటు అప్పటి ఆలయ విజిలెన్స్ అధికారి, ప్రస్తుత రాజమండ్రి ఎస్పీ నరసింహ కిశోర్ ను ఒకే రోజు విచారించారు. ధర్మారెడ్డిని ఐదు గంటలపాటు విచారించగా, ఎస్పీ నరసింహ కిశోర్ ను రెండు గంటలపాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

పరకామణి చోరీ సమయంలోనూ కేసు రాజీ సమయంలోనూ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారని అంటున్నారు. చోరీ చేసిన వ్యక్తితో రాజీకి అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలోనే ఫైల్ తయారైందని, పాలకమండలి సమావేశంలో టేబుల్ ఐటెంగా ధర్మారెడ్డి రాజీ ప్రతిపాదన ప్రవేశపెట్టారని సిట్ ఆధారాలు సేకరించింది. వైవీ సుబ్బారెడ్డి చైర్మనుగా ఉండగా చోరీ జరిగిందని, ఆయన చైర్మనుగా ఉన్నప్పుడే రాజీ ప్రతిపాదనలు తయారయ్యాయని, అయితే కోర్టులో రాజీ కుదిరిన సమయంలో వైవీ స్థానంలో భూమన వచ్చారని సిట్ గుర్తించిందని అంటున్నారు.

రెండు రోజుల క్రితం విచారణకు వచ్చిన టీటీడీ మాజీ చైర్మను భూమన ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంతో ఆ వెంటనే ధర్మారెడ్డిని విచారించేందుకు సిట్ మూడోసారి నోటీసు జారీ చేసిందని చెబుతున్నారు. భూమన వాంగ్మూలం ఆధారంగా ధర్మారెడ్డి ఈ కేసులో కూరుకుపోయారని న్యాయవాద వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రధానంగా చోరీ కేసు నిందితుడితో రాజీకి ఏ నిబంధనల ప్రకారం సిఫార్సు చేశారు? చోరీ జరిగిన తర్వాత నిందితుడిపై శాఖాపరమైన విచారణకు విజిలెన్స్ ను ఎందుకు ఆదేశించలేదు? అన్న ప్రశ్నలకు ధర్మారెడ్డి నుంచి సరైన సమాధానం రాలేదని అంటున్నారు. దీంతో పరకామణి కేసులో ధర్మారెడ్డి పాత్రపై సీఐడీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు.

మరోవైపు కేసులో కీలక సాక్షి, సీఐ సతీష్ కుమార్ మరణంతో దర్యాప్తుపై ప్రభావం ఉంటుందని అంతా భావించారు. కానీ, సిట్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కేసులో సీఐ సతీష్ కుమార్ టీటీడీలో ఏవీఎస్వో హోదాలో పనిచేయగా, ఆయనకు బాస్ గా వ్యవహరించిన అప్పటి సీవీఎస్వో, ప్రస్తుత రాజమండ్రి ఎస్పీ నరసింహ కిశోర్ ను తెరపైకి తెచ్చారు. సీవీఎస్వో అనుమతి లేకుండా ఏవీఎస్వో ఏ పని చేయలేరన్న విషయాన్ని గ్రహించి.. నరసింహ కిశోర్ నుంచి కీలక వివరాలు రాబట్టారని అంటున్నారు. కేసు రాజీ విషయమై ఏవీఎస్వోగా పనిచేసిన సతీష్ కుమార్ అనుమతి తీసుకున్నారా? లేదా? అని ఆయనను ప్రశ్నించారని అంటున్నారు. మొత్తానికి పరకామణి కేసు కీలక దశకు చేరుకుందని విశ్లేషిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్న సిట్.. త్వరలో మొత్తం కుట్రను బయటపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News