భారత్ పై పాక్, చైనా కలిసి కుట్ర.. పెద్ద అస్త్రం రెడీ
ప్రస్తుతం పాకిస్థాన్ సైనిక ఆయుధ సంపత్తిలో సింహభాగం చైనా నుంచే సమకూరుతుండటం గమనార్హం.
భారత్‌తో సరిహద్దు వివాదాలు, భద్రతా సవాళ్ల నేపథ్యంలో పాకిస్థాన్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తన చిరకాల మిత్రదేశమైన చైనా సహకారంతో అత్యాధునిక ఆయుధాలు, అధునాతన యుద్ధ సాంకేతికతను సమకూర్చుకుంటూ భారత భద్రతకు కొత్త సవాళ్లు విసిరేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా పాక్ నౌకాదళంలోకి చైనా తయారీ జలాంతర్గామి అడుగుపెట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కరాచీ తీరానికి చేరిన ‘హంగోర్’ సబ్‌మెరైన్
చైనా నిర్మించిన అత్యాధునిక ‘హంగోర్’ తరగతి జలాంతర్గామి తాజాగా పాకిస్థాన్‌కు చేరుకుంది. కరాచీ తీరానికి చేరిన ఈ సబ్‌మెరైన్ పాకిస్థాన్ నౌకాదళ శక్తిని గణనీయంగా పెంచనుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రక్షణ ఒప్పందాల ప్రకారం... మొత్తం ఎనిమిది హంగోర్ జలాంతర్గాములను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్-చైనా మధ్య గతంలోనే ఒక భారీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 4 జలాంతర్గాములు చైనాలోనే పూర్తిస్థాయిలో తయారవుతాయి. మిగిలిన 4 జలాంతర్గాములు ‘టెక్నాలజీ బదిలీ’ కింద పాకిస్థాన్‌లోని కరాచీ షిప్‌యార్డ్‌లోనే నిర్మిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఒప్పందంలోని అన్ని జలాంతర్గాములు 2028-2030 నాటికి పాకిస్థాన్ సైన్యానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హంగోర్ జలాంతర్గామి ప్రత్యేకతలు ఇవే
పాకిస్థాన్ కొనుగోలు చేసిన ఈ ‘నయా అస్త్రం’ సాధారణమైనది కాదు. ఇది సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా డిజైన్ చేయబడింది. దీని ప్రధాన ఫీచర్లు ఇవే ఈ జలాంతర్గాములు ప్రత్యర్థి దేశాల రాడార్లకు, సోనార్ వ్యవస్థలకు దొరకకుండా అత్యంత రహస్యంగా ప్రయాణించి ఊహించని విధంగా దాడులు చేయగలవు. సుమారు 2,500 నుంచి 2,800 టన్నుల బరువుండే ఈ సబ్‌మెరైన్ సముద్రంలో దాదాపు 300 మీటర్ల లోతు వరకు వెళ్లి ఆపరేషన్స్ నిర్వహించగలదు. ఇందులో 38 మంది శాశ్వత సిబ్బందితో పాటు, అత్యవసర ఆపరేషన్ల కోసం ప్రత్యేక దళాలకు చెందిన కమాండోలు కూడా ప్రయాణించేలా ప్రత్యేక వసతులు ఉన్నాయి.
పాక్ రక్షణ రంగంలో పెరుగుతోన్న చైనా హవా
ప్రస్తుతం పాకిస్థాన్ సైనిక ఆయుధ సంపత్తిలో సింహభాగం చైనా నుంచే సమకూరుతుండటం గమనార్హం. ఇప్పటికే పాక్ వైమానిక, భూతల రక్షణ వ్యవస్థల్లో చైనా మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ కొనుగోలు చేసిన కొన్ని ప్రధాన ఆయుధాలు యుద్ధ విమానాలు, డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్, క్షిపణులు పాక్ వద్ద ఉన్నాయి. దీనిని బట్టి పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ క్రమంగా చైనాపై పూర్తిగా ఆధారపడే స్థితికి చేరుకుందని, ఇది పరోక్షంగా భారత్‌ను చుట్టుముట్టేందుకు చైనా వేస్తోన్న వ్యూహంలో భాగమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అప్రమత్తమైన భారత్
ఈ పరిణామాలపై భారత రక్షణ వర్గాలు తీవ్ర నిఘా ఉంచాయి. పాకిస్థాన్-చైనా మధ్య పెరుగుతోన్న సైనిక, నౌకాదళ సహకారాన్ని న్యూఢిల్లీ అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాక్ జంట కూటమి నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం కూడా తన ప్రాజెక్ట్-75 సబ్‌మెరైన్ కార్యక్రమాలతో పాటు పి-8ఐ నిఘా విమానాలతో గస్తీని మరింత ముమ్మరం చేసింది.