చికెన్‌ బంద్‌... అసలు సమస్య ఏంటంటే?

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి చికెన్ షాప్‌ లు బంద్‌ అయ్యాయి. నేడు ఉదయాన్నే తెరుచుకోవాల్సిన చికెన్‌ షాప్‌లు ఓపెన్‌ కాలేదు.;

Update: 2026-04-01 16:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి చికెన్ షాప్‌ లు బంద్‌ అయ్యాయి. నేడు ఉదయాన్నే తెరుచుకోవాల్సిన చికెన్‌ షాప్‌లు ఓపెన్‌ కాలేదు. ప్రతి రోజు చికెన్‌ షాప్‌కి పరుగులు పెట్టే జనాలు మూసి ఉన్న షాప్‌ను చూసి బిక్కమొహం వేశారు. చికెన్‌ షాప్‌లు బంద్‌ కావడంతో రెస్టారెంట్‌లు సైతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డైరెక్ట్‌ ఫామ్‌ నుంచి కొన్ని రెస్టారెంట్‌లు చికెన్‌ను తెప్పించే ప్రయత్నం చేసినా ఎక్కువ శాతం రెస్టారెంట్‌లు చికెన్‌ బిర్యానీ లేదని బోర్డ్‌లు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని వార్తలు వస్తున్నాయి. చికెన్‌ షాప్‌ల యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. చికెన్‌ షాప్‌ల నిర్వహణ భారంగా మారిందని, లాభాలు లేక, ఖర్చులు పెరిగి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చికెన్‌ షాప్‌ యజమానులు ఆందోళన చేస్తున్నారు.

చికెన్‌ షాప్‌ల నిర్వహణ...

ఫౌల్ట్రీ ఫారమ్‌ నిర్వాహకులు తమకు ఇచ్చే మార్జిన్‌ తగ్గించడం వల్ల లాభాలు రాకపోగా, నష్టపోతున్నామని చికెన్‌ షాప్‌ యజమానులు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేజీకి రూ.15 నుంచి రూ.20 లు ఉన్న మార్జిన్‌ ను ఇప్పుడు రూ.8 నుంచి రూ.10 లకు తగ్గించడంతో చికెన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. తిరిగి మార్జిన్‌ ను పెంచే వరకు చికెన్‌ షాప్‌లను ఓపెన్‌ చేసేది లేదు అంటూ వారు తేల్చి చెప్పారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చికెన్‌ షాపు నిర్వాహకులను ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా స్పందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చికెన్‌ షాప్‌ యాజమాన్యాలతో ఫౌల్ట్రీ ఫామ్‌ యాజమాన్యాలు చర్చలు జరిపేందుకు సుముఖంగా లేరని సమాచారం అందుతోంది.

తెలంగాణలో చికెన్‌ బంద్‌...

రాష్ట్రంలో మెజార్టీ చికెన్‌ హైదరాబాద్‌ లో అమ్ముడు పోతుంది. అక్కడ ప్రతి రోజు లక్షల కేజీల చికెన్‌ వినియోగం ఉంటుంది. అలాంటి హైదరాబాద్‌లో షాప్స్‌ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. దాంతో చికెన్‌ ప్రియులు అల్లాడుతున్నారు. మళ్లీ ఎప్పుడెప్పుడు చికెన్‌ షాప్‌లు ఓపెన్‌ అవుతాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు చికెన్‌ షాప్‌ లు బంద్‌ ఉండటంతో మటన్‌ కి గిరాకీ బాగా పెరిగింది. ఇప్పటికే వెయ్యి రూపాయలు, అంతకు మించి అమ్ముతున్న మటన్‌ వ్యాపారులు ఇప్పుడు 25 శాతం రేట్లు పెంచి అమ్ముతున్నారని తెలుస్తోంది. మధ్య తరగతి వారు మటన్‌ తినలేని వారు నోరు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చికెన్‌ వల్ల ఎక్కువ ప్రోటీన్‌ లభిస్తుంది. ఆ ప్రోటీన్‌ కోసం మాత్రమే కాకుండా ఆహారపు అలవాటుగా కొందరు ప్రతి రోజూ చికెన్ తినే అలవాటు కలిగి ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు దిక్కులు చూడాల్సిన పరిస్థితి.

ప్రభుత్వం ఏం చేస్తుంది...

చికెన్‌ షాపుల బంద్‌ అనేది కనీసం వారం రోజులు అయినా సాగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. తమ డిమాండ్‌లను నెరవేర్చే వరకు చికెన్‌ షాప్‌ లను ఓపెన్‌ చేసేది లేదని, ఎవరైనా ఓపెన్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అసోషియేషన్‌ మెంబర్స్ అంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులు స్పందించాల్సిందే అని, అటు వినియోగదారుడు నష్టపోతూ, చికెన్‌ షాప్‌ వారు నష్టపోతూ కేవలం ఫౌల్ట్రీ యాజమాన్యాలు లాభాలను పొందడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు చికెన్‌ షాప్ యజమానాలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్ని ఈ చికెన్‌ సంక్షోభం ఎప్పటికి సమసి పోతుందా అనేది చూడాలి. ఇప్పటికే యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇలాంటి సమయంలో మళ్లీ చికెన్‌ రేట్లు పెంచితే సామాన్యుడి, మధ్యతరగతి వారి నడ్డి విరిగినట్లు అవుతుంది. ఈ విషయమై ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా రాజీ కుదిరించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News