ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించని ఘట్టం!
| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై మంత్రివర్గ సమావేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరస్పరం కరచాలనం చేసుకుని ఆలింగనం చేసుకున్నారు. ‘హిట్ కొట్టాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించగా, సమన్వయం, సహకారంతోనే విజయం సాధించామని పవన్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చంద్రబాబు సూచించారు.
ప్రతి నెలా రెండుమూడు సార్లు జరిగే ఏపీ మంత్రి వర్గ సమావేశం... స్థానిక ఎన్నికల అనంతరం.. మంగళవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా.. మంత్రులు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే.. ఇప్పటి వరకు జరగని దానికి భిన్నంగా ఈ మంత్రివర్గ సమావేశంలో చప్పట్లు మార్మోగాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇరువురు కరచాలనం చేసుకోవడం.. ఆలింగనాలతో క్యాబినెట్ సమావేశం మంత్రుల ఆనంద సందోహాల నడుమ ప్రారంభమైంది.
తాజాగా జరిగిన మునిసిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. ముఖ్యంగా గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధించిన 94 శాతంస్ట్రయిక్ రేట్‌ను కొనసాగించాయి. అంతేకాదు.. అప్పట్లో 50.9 శాతం సాధించిన ఓటు బ్యాంకు.. ఈ దఫా మరో 6 శాతం పెరిగింది. కూటమి పార్టీలలో బీజేపీ మినహా టీడీపీ, జనసేనలు నూటికి నూరు శాతం అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం మొత్తం.. కరతాళ ధ్వనులతో మార్మోగింది.
``హిట్ కొట్టాం.`` అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో మంత్రులు సైతం అవును సర్.. అంటూ వ్యాఖ్యా నించారు. ఇక, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా కొనసాగించా లన్నారు. ప్రతి విషయంలోనూ సమన్వయం ముఖ్యమని.. స్థానిక సంస్థలే కాదు.. ఏ ఎన్నికలు వచ్చినా కూటమిదే విజయం కావాలని ఆకాంక్షించారు. సమన్వయం-సహకారంతోనే ఈ విజయం సాకారమైందని అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడంలో మంత్రులు ముందుచూపుతో వ్యవహరించారని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సమన్వయం, సహకారం విషయంలో మూడు పార్టీల మధ్య చక్కటి అవగాహన కుదిరిందన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు సహజమేనని అన్నారు. ముందు నుంచి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ విజయం సాకారమైందన్నారు. చంద్రబాబు ముందు చూపు, సీట్ల సర్దుబాటు వంటివి కలిసి వచ్చాయన్నారు. మంత్రి వర్గం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారని ప్రశంసించారు.