యోగాంధ్ర, మోడీ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాను మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.;

Update: 2025-06-21 08:32 GMT

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాను మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు... ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో విశాఖ వేదికగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... 'యోగాంధ్ర' ద్వారా చరిత్ర సృష్టించామని అన్నారు. ఇవాళ ఒక్కరోజే 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది యోగాలో భాగస్వాములయ్యారని తెలిపారు. యోగా అందరికీ అవసరమని అన్నారు.

ఈ భావన బలంగా తీసుకొచ్చిన ప్రధాని మోడీకి ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రధాని యోగాను ప్రపంచం మొత్తం ప్రచారం చేయడంతో.. ఇప్పుడు 175 దేశాలు యోగాను యాక్సెప్ట్ చేశాయని.. అందుకు ఆయన కృషే కారణమని చంద్రబాబు కొనియాడారు.

ఇక.. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించాడని చెప్పిన చంద్రబాబు... యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని.. తొలిసారి రెండు గిన్నిస్‌ రికార్డులు సృష్టించామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కోసం 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వెల్లడించారు.

వాస్తవానికి.. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అనుకుంటే.. ఇప్పుడు 1.80 కోట్ల మందికి సరిఫికెట్లు ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా... యోగా నేచురోపతి, ఆయుర్వేదం మన వారసత్వ సంపద అని చెప్పిన చంద్రబాబు.. ఈ సంపదను ప్రధాని మోడీ వెలికితీశారని.. ప్రజలు ఆర్గానిక్‌ వైపు వెళ్తే.. ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ సందర్భంగా... 11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు.. గేమ్ ఛేంజర్‌ గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపు ఇస్తామని తెలిపారు.

ఢిల్లీ బయలుదేరిన మోడీ!:

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖలో నిర్వహించిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags:    

Similar News