ఊరకే నమ్మేది లేదు...పార్టీ నేతలకు బాబు క్లాస్
చంద్రబాబు గతానికి భిన్నంగా తొలిసారిగా పార్టీ సమావేశాలలో మనసు విప్పారు. తను పార్టీ కోసం రాష్ట్రం కోసం మాత్రమే పనిచేస్తాను అని ఆయన క్లారిటీ ఇచ్చారు.;
తాను ఎవరికీ ఊరకే నమ్మేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఏ పదవి ఇచ్చినా ఎవరికీ ఏ బాధ్యతలు అప్పగించినా కూడా అన్నీ చూసుకునే చేస్తాను అని చెప్పారు తన ఎంపిక చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారు ఎవరినీ గుడ్డినా నమ్మి బాధ్యతలు అప్పగించను అని బాబు తేల్చి చెప్పారు. తాను నాయకుడిని నమ్మాను అంటే దాని కంటే ముందు రాష్ట్రం గురించి ఆలోచించి ఆ దిశగా పనిచేసే వారినే చూస్తాను అని బాబు చెప్పుకొచ్చారు.
తొలిసారిగా బాబు అలా :
చంద్రబాబు గతానికి భిన్నంగా తొలిసారిగా పార్టీ సమావేశాలలో మనసు విప్పారు. తను పార్టీ కోసం రాష్ట్రం కోసం మాత్రమే పనిచేస్తాను అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాల్లో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదని అన్నారు. నాకు రాష్ట్రమే ముఖ్యమని బాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అందువల్ల తాను బాధ్యతలు అప్పగించిన వారు కూడా అంతే కమిట్ మెంట్ తో పనిచేయాల్సి ఉంటుందని బాబు దిశా నిర్దేశం చేశారు.
న్యాయం చేయాల్సి ఉంది :
పార్టీ ఇచ్చిన పదవికి కట్టుబడి ప్రతీ ఒక్కరూ న్యాయం చేయాలని బాబు కోరారు. పదవి అన్నది ఒక బాధ్యతగా ఆయన చెప్పారు. తమకు పదవి దక్కిందని కూర్చోకుండా అందరినీ కలుపుకుని పోవాలని బాబు కోరారు. కో ఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగడం నాయకుల లక్షణంగా ఆయన వివరించారు. అదే సమయంలో నిర్ణయాలు కూడా తగిన సమయంలో తగిన విధంగా తీసుకోవాలని అది పార్టీని ముందుకు నడిపించేలా ఉండాలని ఆయన కోరారు.
సమర్థతకు గీటు రాయి :
నాయకుల సమర్ధతకు గీటు రాయి పనితీరే తప్ప మరోటి కాదని చంద్రబాబు తేల్చేశారు. ప్రతీ పోలింగ్ బూత్ లోనూ ఓట్లు గణనీయంగా పెంచాలని ఆయన కోరారు. గతంలో వచ్చిన ఓట్లు కంటే ఈసారి ఎక్కువగా రావాలని అన్నారు. 2024 లో వచ్చిన ఓట్లు ఎన్నో లెక్క తీసుకుని 2029లో దాని కంటే ఎక్కువ తేవాలని ప్రతీ నాయకుడి సమర్ధతకు అదే గీటు రాయి అవుతుందని బాబు స్పష్టం చేశారు. పార్టీని ఎక్కడికక్కడ బలోపేతం చేయాలని బాబు పిలుపు ఇచ్చారు. 2024 కంటే ఎక్కువ ఓట్ల శాతం సాధిస్తేనే నాయకులుగా గెలిచినట్లు అని బాబు చెప్పుకొచ్చారు. పార్టీ ప్రతిష్ట కూడా దాంతోనే ముడి పడి ఉందని అంతా గుర్తెరగాలని ఆయన కోరారు.
పదవులు అలంకారం కాదని :
మొత్తం మీద చూస్తే చంద్రబాబు పార్టీ నేతలకు ఇచ్చిన పదవులు అన్నవి అలంకారం కాదని వివరంగానే తెలిపారు. బాధ్యతగా పదవులు అందుకోవాలని పార్టీ కోసం పనిచేయాలని ఆయన చెప్పారు. దాంతో 252 మంది దాకా పార్టీ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కమిటీలలో అవకాశాలు దక్కించుకున్న వారు అంతా ఇపుడు అధినేత బాబు మాటలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సి ఉందని అంటున్నారు. పైగా మై టీడీపీ యాప్ లో ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరుని బేరీజు వేస్తూ అధినాయకత్వం వెన్నంటి ఉంటుంది. దాంతో పదవులూ ప్రమాణం అన్నదే సంబరం కాదని ముందు ముందు పనిచేసి జనంలోనూ పార్టీ పెద్దల మనసులోనూ స్థానం సంపాదించాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి ఎంత మంది తమ్ముళ్ళు చంద్రబాబు సూచించిన విధంగా పార్టీ కోసం శ్రద్ధ వహించి పని చేస్తారో.