బాబు మార్క్ మరో రికార్డు...ఎవరూ కొట్టలేరుగా !
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది అర్ధ శతాబ్దం నిండిన రాజకీయ జీవితం.;
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది అర్ధ శతాబ్దం నిండిన రాజకీయ జీవితం. అందులో ఎన్నో రికార్డులు అలా పదిలంగా ఉంటూనే ఉంటాయి. సమీప భవిష్యత్తులో ఎవరూ టచ్ చేయలేని విధంగా బాబు వాటిని సాధించారు. చంద్రబాబు పొలిటికల్ హిస్టరీలో ఇపుడు మరో రికార్డు అలా అలవోకగా వచ్చి చేరింది. ఈ రికార్డు ఆధ్యాత్మిక పరమైనది కావడం విశేషం. ఇంతకీ ఏమా రికార్డు, ఏమా కధ అంటే ఆసక్తికరమే అని చెప్పాలి.
శ్రీవారి భక్తుడిగా :
చంద్రబాబు ఎపుడూ ఒకే మాట చెబుతూ ఉంటారు. తాను శ్రీవారి భక్తుడిని అని. తాను ఏ పని చేసినా స్వామి ఆశీస్సులు నిండుగా తనకు ఉంటాయని. అలిపిరి సంఘటన సందర్భంలో తనను శ్రీవారు రక్షించారని కూడా బాబు భక్తిప్రపత్తులు నడుమ ఎన్నో మార్లు చెప్పారు. ఆయన అలా చెప్పుకోవడమే కాదు శ్రీవారు కూడా ఆయన పట్ల అంత దయ చూపిస్తున్నారా అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకటి. స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవు. అలాంటిది స్వామి వారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించే మహద్భాగ్యం కలగడం అంటే అది ఏ జన్మ పుణ్యమో కదా అంటారు.
ఏకంగా 15 సార్లు :
ఈ విషయంలో కూడా బాబు రికార్డు బద్ధలు కొట్టారు. ఒకటి రెండూ కాదు ఏకంగా పదిహేను సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు ఆయన సమర్పించడం ద్వారా శ్రీవారి దీవెనలు తన మీద ఎంతగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా చేశారు. బాబు 1995లో ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీకి అయ్యారు. అలా తొమ్మిదేళ్ళ పాటు పాలించారు. అలా ఎనిమిది సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం అందుకున్నారు. ఇక విభజన ఏపీలో 2014 నుంచి 2019 మధ్యలో మరో అయిదు సార్లు బాబు స్వామి వారికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవ వేళ సమర్పించారు.
తిరిగి 2024లో ఆయన నాలుగవ సారి సీఎం అయ్యారు. గత ఏడాది ఈ ఏడాది కలులుపుని బాబు అచ్చంగా 15 సార్లు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని అందుకున్నారు అన్న మాట. ఇంకా ఇదే టెర్మ్ లో మరో మూడు సార్లు బాబు సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. అంటే ఈ టెర్మ్ పూర్తి అయ్యేసరికి ఏకంగా 18 సార్లు అన్న మాట. మరి ఇంతటి రికార్డుని ఎవరైనా బ్రేక్ చేయగలరా అన్నదే చర్చ. ఎందుకంటే ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ జీవితమే కాదు ఇన్ని సార్లు సీఎం అయ్యే అవకాశం కూడా ఎవరికి దక్కుతుందో లేదో తెలియదు. అలా చూస్తే బాబు ఒక గ్రేట్ రికార్డునే సాధించి పెట్టారు అని చెప్పాల్సి ఉంది.