బెంగ‌ళూరులో ఉంటే రాజ‌ధాని అవుతుందా: జ‌గ‌న్‌కు ఇచ్చేసిన చంద్ర‌బాబు

''ముఖ్య‌మంత్రి ఎక్క‌డ ఉంటే.. అదే రాజ‌ధాని''- అంటూ ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. జాతీయ స్థాయి మీడియా ముందు వ్యాఖ్యానించిన విష‌యం ర‌భ‌సకు దారి తీసిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-19 04:22 GMT

''ముఖ్య‌మంత్రి ఎక్క‌డ ఉంటే.. అదే రాజ‌ధాని''- అంటూ ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. జాతీయ స్థాయి మీడియా ముందు వ్యాఖ్యానించిన విష‌యం ర‌భ‌సకు దారి తీసిన విష‌యం తెలిసిందే. ఇదేస‌మ‌యంలో రాజ‌ధాని గురించి రాజ్యాంగంలో ఎక్క‌డా చెప్ప‌లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను అప్పులు చేస్తున్నార‌ని.. ఈ భారం ప్ర‌జ‌ల‌పైనే ప‌డుతుంద‌ని కూడా చెప్పుకొచ్చారు. న‌దీ గ‌ర్భంలో రాజ‌ధానిని నిర్మిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు స్పందించ‌లేదు. తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించు కుని మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాజ‌ధానిపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌లంగా తిప్పికొట్టారు. ఇదేస‌మ‌యంలో `క్రెడిట్ చోరీ` అంటూ.. ప‌లు ప‌థ‌కాలు.. పెట్టుబ‌డుల విష‌యంపై వైసీపీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా చంద్ర‌బాబు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఎవ‌రిది ఏ బ్రాండో అంద‌రికీ తెలుసు! అంటూ.. వ్యాఖ్యానించారు.

''నువ్వు బెంగ‌ళూరు, ఇడుపుల పాయ‌లో ఉంటే అదే రాజ‌ధాని అవుతుందా?'' అంటూ.. జ‌గ‌న్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. క‌నీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ.. జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ''ప్ర‌జ‌లు ఎక్క‌డ ఉంటే అది రాజ‌ధాని అవుతుంది.. ప్ర‌జ‌లు ఎక్క‌డ కోరుకుంటే అది రాజ‌ధాని అవుతుంది. నువ్వు మూడు రాజ‌ధానులు అని మూడుముక్క‌ల ఆట ఆడావు.. దానిని ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకున్నారు. నిన్ను 11కు ప‌రిమితం చేశారు. ఇప్ప‌టికైనా తెలుసుకో`` అంటూ జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో క్రెడిట్ చోరీపైనా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ''క్రెడిట్‌ చోరీ అంటూ గ్రీన్‌ కో, భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ నాయ‌కులు విషం చిమ్ముతున్నారు. ఎవ‌రి క్రెడిట్ ఏంటో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. భూములు క‌బ్జా చేయ‌డం.. ఇసుక, మ‌ద్యం మాఫియాలు వైసీపీ క్రెడిట్‌. సైబరాబాద్‌, అమరావతి నిర్మాణం, కియా, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, పెట్టుబ‌డులు తీసుకురావడం టీడీపీ క్రెడిట్‌`` అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News