దేశానికి ఇందిర.. రాష్ట్రానికి జగన్.. ఏం పోల్చారు సర్!
అలానే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఓ పెద్ద పోలికను తెరమీదికి తెచ్చారు.;
రాజకీయాల్లో పోలికలకు కొదవలేదు. సమయం, సందర్భాలకు అనుగుణంగా నాయకులు పోలికలు పెడతారు. అలానే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఓ పెద్ద పోలికను తెరమీదికి తెచ్చారు. విజయవాడలో బుధవారం రాత్రి జరిగిన 'సంవిధాన్ హత్యాదివస్'లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక పోలికను తెరపైకి తెచ్చారు. దేశానికి ఇందిర.. రాష్ట్రానికి జగన్.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులతో దేశాన్ని ఆనాడు ఇందిర కష్టాలు పెట్టిందని.. అనేక మంది జైళ్లలోకి నెట్టిందని.. ప్రజల హక్కులను కూడా కాలరాసిందని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో గత ఐదేళ్లలో జగన్ అచ్చం అలానే వ్యవహరించారని చంద్రబాబు పోలిక చెప్పారు. " ఆనాడు ఇందిర చెప్పి ఎమర్జెన్సీ విధించారు.కానీ, గత ఐదేళ్లలో రాష్ట్రంలో జగన్ చెప్పకుండా అప్రకటిత ఎమర్జీని అమలు చేశారు. దానికీ దీనికి ఏమీ తేడాలేదు. అప్పటివే కాదు.. గత ఐదేళ్లలోనూ ప్రజలు చీకటి జీవితాలనే అనుభవించారు. నోరు మెదిపితే కేసు. కాలు బయటకు పెడితే కేసు. విగ్రహాల ఏర్పాటు.. కూల్చివేతలు.. కేసులు-జైళ్లు.. ఇదీ గత ఐదేళలో రాష్ట్రంలో జరిగింది. ఆనాడు పాలన ఎలా ఉండకూడదో చెప్పడానికి.. ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే.. ఈనాడు "పాలకుడు' ఎలా ఉండకూడదో చెప్పడానికి వైసీపీ పాలన ఒక కేసు స్టడీ" అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
గడిచిన ఐదేళ్ల కిందట.. ఇదే రోజు(జూన్ 25)న రాష్ట్రంలో ప్రజావేదికను కూల్చేశారని.. ఇది సంవిధానం హత్యాదివస్‌తో సమాన మని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వాదులైన వారు.. సోషల్ మీడియా వేదికగా చర్చ పెట్టినా.. పోస్టులు చేసినా వారిని అర్ధరాత్రి అరెస్టుచేశారని.. ఇది సంవిధాన్ హత్యేనని పేర్కొంటూ.. నాటి జర్నలిస్టు అంకబాబు అరెస్టును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాను, పవన్, మోడీ చేతులు కలిపామని.. రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశామని.. దీనికి ప్రజలు కూడా కలిసి వచ్చారని చెప్పారు. ఏడాది పాలనలో సుపరిపాలనను చేరువ చేశామని వివరించారు.
ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు లేదన్న చంద్రబాబు.. అలాంటి వారిని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా కూలిపోయిందని.. నాడు ఎన్టీఆర్ పదవిని లాగేసుకున్నారని.. అయితే.. ప్రజలు ఆయనపై ఉన్న విశ్వాసంతో తిరిగి నిలబెట్టారని చెప్పారు. ప్రజలను హింసించి ఆనందం పొందే వారిని ప్రజలే తిరబడి పక్కన పెట్టారని గత ఎన్నికలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. " చీకటి రోజులను గుర్తు పెట్టుకోవాలి. ఈ అవసరం కూడా ఉంది. ఎందుకంటే.. మంచిని పోల్చుకునేందుకు చీకటి రోజులు ఉపకరిస్తాయి" అని చంద్రబాబు అన్నారు.