బనకచర్ల లేకపోతే బాబు రాజకీయం సాగదా ?
ఏపీలో పదకొండేళ్లుగా పోలవరం ప్రాజెక్టే అలా సాగుతూ ఉంది. ఎపుడు పూర్తి అవుతుంది అంటే కొత్త డేట్లు చెబుతున్నారు.;
ఏపీలో పదకొండేళ్లుగా పోలవరం ప్రాజెక్టే అలా సాగుతూ ఉంది. ఎపుడు పూర్తి అవుతుంది అంటే కొత్త డేట్లు చెబుతున్నారు. ఇంతలో ఎత్తును సైతం తగ్గించేశారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇపుడు కొత్తగా పోలవరం బనకచర్ల పధకాన్ని చంద్రబాబు ఎందుకు తలకెత్తుకున్నారు అన్నది కీలక ప్రశ్న. పైగా ఈ ప్రాజెక్ట్ ఏమైనా తక్కువనా ఏకంగా 81 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్నది.
మూడు దశలుగా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ కే బాబు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆ కారణాల మీద తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తరచూ మాట్లాడుతూనే ఉన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు పార్టీ మద్దతు కావాలని అలాగే చంద్రబాబు రాజకీయానికి బనకచర్ల కావాలని రేవంత్ రెడ్డి తాజాగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా కూడా చెప్పారు.
మరి బాబు రాజకీయానికి అంతలా బనకచర్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రాయలసీమ గ్రేటర్ రాయలసీమలకు తాగు సాగు నీరు ఇచ్చే ప్రాజెక్టు ఇది. రాయలసీమలో గ్రేటర్ సీమలో కూడా వైసీపీకి బలం చాలా ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికలను కొలబద్ధగా చూడాల్సిన అవసరం లేదు. స్వయాన ఒక బలమైన సామాజిక వర్గం అలాగే వైసీపీ క్యాడర్ కూడా సహాయ నిరాకరణ చేయడంతో రాయలసీమలో కూటమికి అత్యధిక సీట్లు వచ్చాయి కానీ మామూలుగా అయితే వైసీపీ ఓడే సీన్ లేదు.
ఇక 2029 ఎన్నికల నాటికి కూటమి అయిదేళ్ళ పాలన మీద వ్యతిరేకత పూర్తిగా ఉంటుంది. పైగా అమరావతిలో బిగ్ స్కేల్ లో రాజధాని నిర్మాణం ఎటూ సీమ వాసులకు ఇబ్బందికరంగా ఉంటుంది, మద్రాస్ నుంచి ఏపీ విడిపోయినపుడు కర్నూల్ నే రాజధానిగా ఎంచుకున్నారు ఇపుడు కనీసం హైకోర్టు కూడా ఇవ్వలేదు.
మళ్ళీ హైదరాబాద్ మోడల్ గానే కేంద్రీకృత అభివృద్ధి మీద చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు అని చర్చ సాగుతోంది. అమరావతి రాజధానికి పెట్టే లక్షల ఖర్చులో రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతానికి పావు అయినా పెట్టడం లేదు అన్న అసంతృప్తి ఉంది. ఇక అభివృద్ధి విషయంలో బాగా వెనకబడిన జిల్లాలుగా అవి ఉన్నాయి.
దాంతో రాయలసీమకు గట్టి మేలు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన పోలవరం బనకచర్ల అన్న ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారు. దీని వల్ల ఏకంగా రాయలసీమను సస్యశ్యామలం చేయడం అవుతుంది. అంతే కాదు గతంలో మాదిరిగా రతనాల సీమ అవుతుంది. తాగునీటికి సాగు నీటికి గత ఏడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న రాయలసీమకు పూర్తి న్యాయం జరుగుతుంది.
బాబు అలా అపరభగీరధుడిగా నిలిచిపోతారు. అంతే కాదు 2029లో టీడీపీకి పక్కాగా అధికారం సీమ వాసులే ఇస్తారు. అందుకే బాబు ఖజానా ఇబ్బందులు ఎన్ని ఉన్నా బనకచర్ల ప్రాజెక్ట్ అని పదే పదే చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రాజెక్టులు చేసుకోవాలని కూడా మరో ఆలోచన ఉంది రేపటి రోజున బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే ఏపీ మాట వినదు అన్న భయాలూ ఉన్నాయి.
మొత్తానికి బనకచర్ల విషయంలో బాబు మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ తెలంగాణాకు చెందిన బీజేపీ నేతల ఒత్తిడి వల్ల దానికి బ్రేకులు పడిపోయాయి. బీజేపీ వరకూ చూస్తే ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ తెలంగాణాలో తానే అధికారంలోకి రావాలని అనుకుంటోంది. అందుకే బీజేపీ త్రాస్ అటు మొగ్గింది. మొత్తానికి బాబు బనకచర్లకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి.
మరి ఈ విషయం మీద బాబు మార్క్ ఒత్తిడి ఎలా ఉంటుంది అన్నదే చూడాల్సి ఉంది. కేంద్రం కూడా ఏపీలో టీడీపీ మద్దతు మీద ఆధారపడి ఉంది, పైగా నాలుగేళ్ళ కాలం చేతిలో ఉంది, అందువల్ల బనకచర్ల విషయంలో ఏపీ తగ్గినట్లు కాదని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారు. బనకచర్లకు పర్యావరణ అనుమతులు రానప్పటికి ఈ ప్రాజెక్ట్ ఆగినట్లు కాదని జస్ట్ కామా మాత్రమే కానీ ఫుల్ స్టాప్ అసలు కాదని స్పష్టంగానే అంచనా వేశారు. చూడాలి మరి ఏమి జరుగుతుదో.