యూదుల మాట చెప్పి తన జీవితకలను రివీల్ చేసిన చంద్రబాబు!

రాష్ట్రాల్ని పక్కన పెడితే తెలుగోళ్లకు సంబంధించి.. తెలుగు జాతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.;

Update: 2026-01-06 10:00 GMT

రాష్ట్రాల్ని పక్కన పెడితే తెలుగోళ్లకు సంబంధించి.. తెలుగు జాతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజాగా గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన జీవిత కలను రివీల్ చేశారు. దేశంలో హిందీ తర్వాత రెండు రాష్ట్రాలున్నది తెలుగు భాషకే అన్న ఆయన.. ‘మదరాసీ నుంచి తెలుగుజాతిగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రపంచంలో తెలుగువారు ఎంత గొప్పగా ఎలా ఎదిగారో తెలిసిందే. సైబరాబాద్ ఐటీ విప్లవం ప్రపంచంలో మన స్థానాన్ని ఎలా నిలబెట్టిందో తెలిసిందే. తెలుగువారు ప్రపంచంలో అగ్రశ్రేణికి ఎదగాలంటే ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లగలమన్న చంద్రబాబు.. ‘‘సాగర్ జలాలు ఉపయోగించుకోవాలి. కిందటి ఏడాది క్రిష్ణా.. గోదావరినదుల నుంచి 6282 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకుంటే మేమేప్పుడూ అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడూ కాదనలేదు. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఫర్లేదు. మన రాష్ట్రానికీ నీళ్లు వస్తాయని ముందుకెళ్లా. గడిచిన 40 ఏళ్లలో ఏటా 3వేల టీఎంసీల నీళ్ల గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లిపోయాయి. పోలవరం పూర్తవుతుంది. క్రిష్ణా.. గోదావరి అనుసంధానం జరుగుతుంది. ఉన్న నీటివనరులను పూర్తిగా వినియోగించని దేశం మనదే. తెలంగాణలో గోదావరి నీళ్లు అవసరమైనన్ని వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు. ఐకమత్యం అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ముందుకు వెళ్లాలి’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తన జీవితకాల కలను ఆవిష్కరించారు నీటి విషయంలోనూ.. ఇతరత్రా అంశాల్లోనూ తెలుగువారంతా కలిసి ఉండాలని.. ప్రపంచంలో ఎక్కడున్నా మనకు గుర్తింపు తెలుగుబాషతోనే అన్న ఆయన.. ‘తెలుగు భాష ముందుకు వెళ్లాలంటే.. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్ కావాలంటే మనకు ఐకమత్యం అవసరం. తెలుగు వారికే రెండు రాష్ట్రాలు ఉండటం మనకు గౌరవం. దాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి. ఇజ్రాయెల్ లో యూదులు కోటి మంది లేకున్నా ప్రపంచంలోనే శక్తివంతమైన వారిగా ఎదిగారు. 2047 నాటికి వారిని కూడా అధిగమించి తెలుగుజాతి నంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం’’ అంటూ తన కోరికను బయటపెట్టారు. ఏపీని బూచిగా చూపిస్తూ.. ప్రజల్లో సెంటిమెంట్ రాజేసి విద్వేషాలను రగలించే వారికి చంద్రబాబు తనదైన శైలిలో స్నేహహస్తాన్ని చాటటం ద్వారా తెలుగు ప్రజల మధ్య ఉండాల్సిన బంధాన్ని.. అనుబంధాన్ని గుర్తు చేశారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News