కారు ప్రమాదాలకు రంగు కూడా ఓ కారణమేనా? షాకింగ్ రిపోర్టు
ఎంత జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసినా ప్రమాదాలు బారిన పడటానికి ఆ కార్ల రంగు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలింది.;
ఎంత జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసినా ప్రమాదాలు బారిన పడటానికి ఆ కార్ల రంగు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ కారు రంగుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని రంగుల కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని గుర్తించారు. ప్రధానంగా నలుపు రంగు కార్లు విజిబిలిటీ తక్కువగా ఉండటంతో ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాయని స్పష్టమైంది. మొత్తం ప్రమాదాల్లో 47 శాతం నలుపు రంగు కార్లు కావడం ఆసక్తికర విషయంగా చెబుతున్నారు.
అదేవిధంగా నలపు రంగు కార్లు తర్వాత 11 శాతం ప్రమాదాలను గ్రే కలర్ వాహనాలు ఎదుర్కొంటున్నాయి. దీని తర్వాత స్థానంలో సిల్వర్ రంగు వాహనాలు 10 శాతం, ఎరుపు, నీలం రంగు వాహనాలు 7 శాతం ప్రమాదాలకు గురవుతున్నాయి. తెలుపు, పసుపు, ఆరెంజ్, బంగారు వర్ణంలో ఉన్న కార్లకు తక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ సర్వేపై ఇంటర్నెట్ లో నెటిజన్లు ఎక్కువగా స్పందిస్తున్నారు. తమ స్వీయ అనుభవాలను పంచుకుంటున్నారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలు, దీపావళి సందర్భంగా దేశంలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇలాంటి సమయంలో విడుదలైన సర్వే ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కారు కొనడానికి ముందే వివిధ రంగులను ఎంచుకుంటుంటారు. కొందరు తమ జాతకాలకు అనుగుణంగా కూడా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే జాతకాలు ఎలా ఉన్నా, శాస్త్రీయ అధ్యయనం ద్వారా తెలుసుకున్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక్క ప్రమాదాలే కాకుండా కార్లు కొనే సమయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుంది. భవిష్యత్తులో మెయింటెనెన్స్ ఖర్చులను కూడా గమనించి కార్లను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్న నలుపు రంగు కారు వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. ఎండను ఎక్కువగా ఆకర్షించడం వల్ల నలుపు, ముదురు రంగు కార్లలో ఏసీ లేకుండా ప్రయాణించడం కష్టమని అదేవిధంగా కారు మైలేజీ తగ్గుతుందని చెబుతున్నారు.
ఇక ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉన్న తెలుపు రంగు కార్లకు నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు. తెలుపు, సిల్వర్ కలర్ కార్లకు ఏదైనా గీతలు, దుమ్ము పడినా ఎక్కువగా కనిపించదని అంటున్నారు. అదే సమయంలో నలుపు, ఎరుపు వంటి ఇతర రంగుల వాహనాల్లో గీతలు, ధూళి వంటి వాటిని గుర్తించడం చాలా సులభం. లేత రంగులకు తక్కువ శ్రమ అవసరం. ముదురు రంగులకు బాడీ ప్యానెల్‌లను పాలిష్ చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.