కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ కాదు.. బర్నీహాట్

భారతదేశంలో అత్యంత కాలుష్య ప్రాంతమన్నంతనే దేశ రాజధాని ఢిల్లీ పేరును టక్కున చెప్పేస్తారు.;

Update: 2026-01-10 04:19 GMT

భారతదేశంలో అత్యంత కాలుష్య ప్రాంతమన్నంతనే దేశ రాజధాని ఢిల్లీ పేరును టక్కున చెప్పేస్తారు. కానీ.. అది నిజం కాదు. ఢిల్లీకి మించిన మరో ప్రదేశముంది. అదే అసోం.. మేఘాలయ సరిహద్దుల్లో ఉండే ఒక పారిశ్రామిక పట్టణం. దీనికున్న ట్రాక్ రికార్డు గురించి తెలిస్తే చెమటలు పట్టాల్సిందే. 2024లో అయితే ఏకంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతమన్న ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకుంది.

అడ్డూ అదుపు లేని పారిశ్రామికీకరణే బర్నీహాట్ కాలుష్యానికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు.. స్టీల్.. ఉక్కు ఫ్యాక్టరీలు మాత్రమే కాదు డిస్టిలరీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువుల కారణంగా ఇది అత్యంత కాలుష్య కారక ప్రదేశమన్న పేరును సొంతం చేసుకుంది. ఇక్కడ పీఎం10, పీఎం2.5 స్థాయిలు మోతాదుకు మించి నమోదవుతుంటాయి. దీనికి తోడు రెండు రాష్ట్రాలు (అసోం, మేఘాలయ) సరిహద్దుల్లో ఉండటంతో వాహన కాలుష్యం కూడా భారీ ఎత్తున నమోదవుతూ ఉంటుంది.

దేశంలో అత్యంత కాలుష్య ప్రాంతాల జాబితాలో టాప్ 3లో తొలి స్థానాన్ని బర్నీ హాట్ అయితే.. తర్వాతి స్థానం ఢిల్లీ.. మూడోస్థానంలో గాజియాబాద్ నిలుస్తోంది. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా 190 నగరాలు.. పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కకున్నట్లుగా తేల్చారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజాగా అధ్యయనంలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.

దేశ వ్యాప్తంగా 44 శాతం నగరాలు దీర్ఘకాలంగా వాయుకాలుష్యంతో సతమతమవుతున్న విషయాన్ని గుర్తించారు. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 2019లో కేంద్రం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. అంతేకాదు.. ఇందుకోసం రూ.13,415 కోట్లు కేటాయిస్తే.. అందులో ఇప్పటికే మూడొంతుల నిధులను ఖర్చు చేసినా.. ఆశించినంత ఫలితాలు నమోదు కాకపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. వేల కోట్ల రూపాయిలు ఖర్చు అవుతున్నా.. కాలుష్య తీవ్రత ఆశించిన స్థాయి తర్వాత.. కొన్ని చోట్ల కనీస స్థాయిల్లో కూడా మార్పు రాకపోవటం దేనికి నిదర్శనం? అన్నది అసలు ప్రశ్న.

అత్యధిక కాలుష్య (పీఎం2.5 సూచీ ప్రకారం) ప్రాంతాలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో సాగుతోంది. ఈ రాష్ట్రంలో 416 ప్రాంతాలు కలుషిత జాబితాలో నిలవగా.. తర్వాతి స్థానంలో రాజస్ధాన్ (158 ప్రాంతాలు), గుజరాత్ (152), మధ్యప్రదేశ్ (143), పంజాబ్ (136), బిహార్ (136), పశ్చిమబెంగాల్ (124) ప్రాంతాల్లో నిలిచాయి. అదే సమయంలో కాలుష్యపరంగా (పీఎం 10 సూచీ పరంగా) కలుషిత ప్రాంతాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో నిలిస్తే తర్వాతి స్థానంలో యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశాలు నిలిచాయి.

Tags:    

Similar News