సీఎం రేవంత్ రెడ్డి పై స్పీకర్‌కు కంప్లెయింట్.. విషయం ఏంటంటే!
తెలంగాణ ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభా నాయకుడు రేవంత్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాదరావుకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.;
తెలంగాణ ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభా నాయకుడు రేవంత్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాదరావుకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వాస్తవానికి సభా నాయకుడిగా ఉన్న వ్యక్తిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం అనేది ఇదే తొలిసారి అని సభా వ్యవహారాలు చూసే సీనియర్లు చెబుతున్నారు. ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో .. సభను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దీంతో సభా సమయం వృథా అయిందని ఆరోపించారు.
రెండు రోజుల కిందట తెలంగాణ అసెంబ్లీలో నీళ్లు-నిజాలు పేరుతో చర్చ చేపట్టారు. ఈ సమయంలో బీఆర్ ఎస్ సహా అధికార పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడారు. అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే.. ఆయన సబ్జెక్టును వదిలేసి.. వేర్వేరు విషయాలను ప్రస్తావించారని.. దీంతో సభా సమయం వృథా అయిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సబ్జెక్టుతో సంబంధం లేని విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతను అనవసరంగా ప్రస్తావించారని తెలిపారు.
అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోని మినిట్స్‌ను కూడా సభలో ప్రస్తావించారని తెలిపారు. ఇది సభానియమాలకు విరుద్ధమన్నారు. మరీ ముఖ్యంగా కృష్ణానది జలాల తాత్కాలిక ఒప్పందాన్ని కూడా ఆయన సభలో మాట్లాడారని.. ఇది కూడా సభా సమయాన్ని వృథా చేయడమేనని పేర్కొన్నారు. పైగా సదరు ఒప్పందంలోని అంశాలను తప్పుగా అన్వయించారని తెలిపారు. ఇది ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వబోదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.
చెల్లుతుందా?
సభా నాయకుడిపై ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏరాష్ట్రంలోనూ ఈ తరహా వివాదాలు తెరమీదికి రాలేదు. కానీ, తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ కు చెందిన సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే.. సభా నాయకుడిగా ఆయనకు ఉన్న ప్రత్యేక హక్కుల నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించినప్పటికీ.. స్పీకర్ స్పందించాల్సిన అవసరం ఉండదు. గతంలో ఇలాంటి సమస్య తెరమీదికి రాని నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పీకర్ ప్రసాదరావు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.