సోనమ్ నుంచి సియా వరకు.. కిల్లర్స్‌గా మారుతున్న పెళ్లికూతుళ్లు.. బలి అవుతున్న మగాళ్లు
నిన్నటి వరకు ఆ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయని ఆశించారు.. పచ్చని పందిట్లో పిల్లవాడు పెళ్లిపీటలు ఎక్కుతుంటే చూసి మురిసిపోవాలని ఆ తల్లిదండ్రులు కోట్లకు కోట్లు ఖర్చు చేసి కలల మహల్‌ను బుక్ చేశారు.
నిన్నటి వరకు ఆ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయని ఆశించారు.. పచ్చని పందిట్లో పిల్లవాడు పెళ్లిపీటలు ఎక్కుతుంటే చూసి మురిసిపోవాలని ఆ తల్లిదండ్రులు కోట్లకు కోట్లు ఖర్చు చేసి కలల మహల్‌ను బుక్ చేశారు. కానీ ఏ చేతికైతే ఆశగా మెహందీ పెట్టాడో.. ఏ మెడలోనైతే మూడు ముళ్లు వేయాలని కలలు కన్నాడో.. అదే చేతులు తన ఊపిరి తీస్తాయని ఆ అభాగ్యుడు ఊహించలేకపోయాడు! పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువే.. కాలయముడిగా మారి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన కిరాతకం ఇది. ప్రేమ, వివాహం లాంటి పవిత్ర బంధాలను నమ్ముకున్న మగవాళ్ల గుండెల్లో ఇప్పుడు ఈ దారుణాలు రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అసలు నూరేళ్ల తోడుండాల్సిన పెళ్లికూతుళ్లే ఇలా 'కిల్లర్స్'గా ఎందుకు మారుతున్నారు? ప్రేమ పేరుతో ప్రాణాలు తీస్తున్న ఈ వికృత పోకడల వెనుక ఉన్న నిఖార్సైన నిజాలేంటి?
ఒకప్పుడు సమాజంలో భర్తల వేధింపులు.. ప్రేమ నిరాకరించిందనే కక్షతో ప్రియురాళ్లపై ఉన్మాదులు చేసిన దాడుల గురించే ఎక్కువగా వినేవాళ్లం. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ మారుతోంది. నమ్మి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని, జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేయాల్సిన కాబోయే భర్తను పెళ్లికూతుళ్లే అత్యంత కిరాతకంగా మట్టుబెడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్న సోనమ్ రఘువంశీ, ముస్కాన్ రస్తోగీ, ప్రగతి యాదవ్.. నేడు మహారాష్ట్రలో వెలుగుచూసిన సియా గోయల్ ఉదంతం వరకు వరుస కేసులు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
కోట్లు ఖర్చు చేసి ప్యాలెస్ బుకింగ్.. అంతలోనే ఘోరం
మహారాష్ట్రలోని పుణేకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌తో వివాహం నిశ్చయమైంది. మరికొద్ది రోజుల్లో ఘనంగా పెళ్లి జరగాల్సి ఉంది. తన పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాడు కేతన్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి రాయల్ ప్యాలెస్ బుక్ చేయడమే కాకుండా అతిథుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశాడు. అయితే ఏ వధూవురుడూ ఊహించని ఘోరం కేతన్ జీవితంలో జరిగింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతే తన ప్రాణాలు తీస్తుందని ఆ అభాగ్యుడు ఊహించలేకపోయాడు.
లోయలోకి తోసేసి.. పాము కాటుగా చిత్రీకరించి..!
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సియా గోయల్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె తన ప్రియుడితో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని పక్కా స్కెచ్ వేసింది. పుణే శివార్లలోని చారిత్రాత్మక లోహగడ్ కోట ప్రాంతానికి కేతన్‌ను సరదాగా తీసుకెళ్లి అక్కడ ప్రణాళిక ప్రకారం లోయలోకి తోసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ ఘాతుకానికి నాలుగు రోజుల ముందే కేతన్‌ను చంపేందుకు తొలి ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. మొదట ఆ ఘటనను పాము కాటుగా ప్రచారం చేసినప్పటికీ అది కూడా సియా కుట్రలో భాగమేనని కేతన్ తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. "నా కొడుకుతో పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది. అంతేకాని ఇలా ప్రాణాలు తీయాలా?" అంటూ ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు.
ట్విస్ట్ ఏంటంటే.. కేతన్ మరణం తర్వాత సియా సోషల్ మీడియాలో ఏమీ తెలియనట్టు తీవ్ర విషాదంలో ఉన్నట్లు పోస్టులు పెట్టింది. గతంలో కేతన్ ఆమెకు ప్రపోజ్ చేసిన రొమాంటిక్ వీడియోలను షేర్ చేస్తూ డ్రామా ఆడింది. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు రంగు బయటపడింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "రిజెక్ట్ చేసే ధైర్యం లేక మర్డర్ ప్లాన్ చేస్తారా?" అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
బంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయి?
ఇలాంటి వరుస ఘటనలు సమాజంలో మారుతున్న విలువలపై, పడిపోతున్న నైతికతపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి నేరాలకు గల ప్రధాన కారణాలు చూస్తే.. నిజాయితీ లేకపోవడమే కారణం. సంబంధాల్లో స్పష్టత లేకపోవడం, బలవంతపు పెళ్లిళ్లకు నో చెప్పలేక నేరాల బాట పట్టడం చేస్తున్నారు. తప్పుడు ప్రతిష్టలు, రహస్య సంబంధాలను దాచడానికి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల... కుటుంబ వ్యవస్థల బలహీనతతో పాటు నైతిక విలువలు లోపించడం, పెరిగిన మానసిక ఒత్తిళ్లు, స్వార్థపూరిత ఆలోచనలు పెరిగిపోతున్నాయి.
ప్రతి మహిళను లేదా ప్రతి ప్రేమ వివాహాన్ని ఇలాంటి సంఘటనలతో ముడిపెట్టడం సరైంది కాదని సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇవి కేవలం వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులు చేసిన వ్యక్తిగత నేరాలు మాత్రమే. అయినప్పటికీ పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు పరస్పర గౌరవం, నమ్మకం, స్పష్టమైన నిర్ణయాలు ఎంత అవసరమో ఈ సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.