డాలర్ ఆధిపత్యానికి బ్రేక్: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 'బ్రిక్స్' సంచలనం!
అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అమెరికా.. దాని పాశ్చాత్య మిత్రదేశాలకు మితిమీరిన లబ్ధిని చేకూరుస్తోందని గట్టిగా నమ్ముతున్నాయి.
ఈ ప్రపంచంపై అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఎదురేలేదు! దశాబ్దాలుగా అంతర్జాతీయ వాణిజ్యం.. గ్లోబల్ రిజర్వులు.. ఇంధన మార్కెట్లు.. ఆర్థిక లావాదేవీలలో అమెరికా డాలర్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. మిడిల్ ఈస్ట్‌లోని చమురు ఒప్పందాల నుండి ఆసియాలోని అప్పుల మార్కెట్ల వరకు ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు డాలరే కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో `బ్రిక్స్` (BRICS) కూటమి బలోపేతం కావడం... సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ వంటి దేశాలు ఇందులో చేరడంతో `డీ-డాలరైజేషన్` (డాలర్ రహిత వాణిజ్యం) పై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తికి... మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఈ కూటమి విస్తరణ ఒక బలమైన సంకేతంగా నిలుస్తోంది.
అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అమెరికా.. దాని పాశ్చాత్య మిత్రదేశాలకు మితిమీరిన లబ్ధిని చేకూరుస్తోందని గట్టిగా నమ్ముతున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నేటికీ రెండో ప్రపంచ యుద్ధం నాటి పాత అధికార సమతుల్యతనే ప్రతిబింబిస్తున్నాయి. కానీ ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వృద్ధిలో.. తయారీ రంగంలో భారత్, చైనాల పాత్ర నాటకీయంగా పెరిగింది. వీటికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా విదేశీ నిల్వలను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేయడం మిగతా దేశాలను అప్రమత్తం చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో గ్రహించిన దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చైనా అంతర్జాతీయ ఇంధన ఒప్పందాలలో తన `యువాన్` కరెన్సీని తీవ్రంగా ప్రోత్సహిస్తుండగా.. రష్యా-చైనాలు తమలో తాము డాలర్ ప్రమేయం లేకుండానే ఎక్కువ భాగం వాణిజ్యం సాగిస్తున్నాయి. భారతదేశం కూడా కొన్ని భాగస్వామ్య దేశాలతో `రూపాయి` ఆధారిత చెల్లింపులను పరిశీలిస్తోంది. అయితే డాలర్ పతనం తథ్యమనే అంచనాలు కాస్త అతిశయోక్తిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే డాలర్ బలం కేవలం అమెరికా రాజకీయ ప్రభావంపైనే కాకుండా ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు దానిపై ఉన్న నమ్మకం, స్థిరత్వం- అమెరికన్ మార్కెట్ పారదర్శకతపై ఆధారపడి ఉంది. చైనా ఆర్థికంగా పెద్దదైనా కానీ.. అక్కడి కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు యువాన్‌ను పూర్తిగా నమ్మలేకపోతున్నారు.
మరోవైపు బ్రిక్స్ కూటమిలో కూడా అంతర్గత విబేధాలు స్పష్టంగా ఉన్నాయి. చైనా, భారత్‌లు ఆర్థికంగా సహకరించుకుంటున్నా.. వ్యూహాత్మకంగా పరస్పరం పోటీపడుతున్నాయి. రష్యా అంతర్జాతీయ స్థితి.. బ్రెజిల్ లేదా దక్షిణాఫ్రికా స్థితులతో ఏమాత్రం పోలదు. పైగా ఈ కూటమిలోని కొన్ని కొత్త దేశాలు మల్టీ పోలార్ ప్రపంచాన్ని కోరుకుంటూనే అమెరికాతో సన్నిహిత భద్రతా, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఈ ఏకాభిప్రాయ లేమి కారణంగా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంపూర్ణమైన ప్రత్యామ్నాయాన్ని తక్షణమే తీసుకురావడం బ్రిక్స్‌కు అంత సులువు కాదు. కానీ ఈ కూటమిని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే స్థానిక కరెన్సీలలో వాణిజ్యం.. బంగారంతో నిల్వల వైవిధ్యీకరణ ద్వారా డాలర్‌పై ఆధారపడటాన్ని ఇవి క్రమంగా తగ్గిస్తున్నాయి.
ప్రపంచం ఇప్పుడప్పుడే డాలర్ సంపూర్ణ పతనాన్ని చూడకపోయినా.. ఒకే ఒక్క ఆర్థిక కేంద్రం స్థానంలో ప్రాంతీయ కరెన్సీలు బలపడే ఒక మల్టీపోలార్ ఆర్థిక శకం వైపు నెమ్మదిగా అడుగులు పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదంతా పెరుగుతున్న డాలర్ కు విరుగుడుగా పని చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరింత స్వేచ్ఛను ఇస్తుందని కొందరు వాదిస్తుంటే.. దీని వల్ల అంతర్జాతీయ అస్థిరత పెరుగుతుందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అంతిమంగా ఈ పోరాటం కేవలం కరెన్సీల గురించి మాత్రమే కాదు.. రానున్న దశాబ్దాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియమాలను ఎవరు శాసిస్తారనే సార్వభౌమత్వ యుద్ధంగా దీనిని చూడాలి.