ఛాతీ లోతు నీటిలో లైవ్ రిపోర్టింగ్... షాకింగ్ వీడియో!

కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు రిపోర్టింగ్ సమయంలో చేసే కొన్ని రిస్కులు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయనే సంగతి తెలిసిందే.;

Update: 2025-07-22 19:30 GMT

కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు రిపోర్టింగ్ సమయంలో చేసే కొన్ని రిస్కులు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ప్రధానంగా అడవుల్లోనూ, కొండప్రాంతాల్లోనూ, ప్రకృతి విపత్తుల సమయంలోనూ, యుద్ధాల సమయంలోనూ వారు ప్రజలకు సమాచారం అందించడం కోసం ఎంతో రిస్క్ చేస్తుంటారు. ఈ సమయంలో ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఓ రిపోర్టర్ చేసిన పని షాకింగ్ గా మారింది.

అవును... బ్రెజిల్‌ లోని బాకబాల్ రీజియన్‌ మారాన్యో ప్రాంతంలో రయిస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్‌ 30వ తేదీన అదృశ్యమైంది. ఆమె తన స్నేహితులతో కలిసి మియరిమ్‌ నదిలో ఈతకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఆమె నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు.

మరోవైపు, గత ఈతగాళ్లను రంగంలోకి దింపి ఎంతో గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సమయంలో... టీవీ రిపోర్టర్ లెనిల్డో ఫ్రాజావో ఆ నీళ్లలోకి దిగి బాలిక మిస్సింగ్‌ కేసు వార్తకు సంబంధించి రిపోర్టింగ్‌ చేస్తూ కనిపించాడు. సుమారు చాతీ లోతు నీటిలోకి మైక్ పట్టుకుని వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నాడు.

ఈ సమయంలో అతని కాళ్లకు ఏదో తాకినట్లు అనిపించడంతో.. ఒక్కసారిగా వెనక్కి కదిలాడు.. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. ఈ సమయంలో ఒక్కసారిగా వణికిపోయిన సదరు రిపోర్టర్... ఆ నీటిలో తన కాళ్లకు ఏదో తగిలిందని.. అది బహుశా మనిషి చెయ్యి అనుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ లోపలికి వెళ్లే సాహసం చేయనని చెప్పుకున్నాడు!

దీంతో... వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ నీటిలోని బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అనంతరం ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు.

అయితే.. ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు. నీట మునిగే ఆమె చనిపోయిందని.. బహుశా ఆ మృతదేహం నది అడుగుభాగంలోని మట్టిలో కూరుకుపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. మరోవైపు... ఆమె చదువుతున్న స్థానిక మున్సిపల్ పాఠశాల మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

Tags:    

Similar News