నంబర్స్ గేమ్‌లో ఎన్డీయే నెగ్గుతుందా ?

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఇపుడు ఒక బిగ్ టాస్క్ ని ఫేస్ చేస్తోంది. పార్లమెంట్ లో రెండు కీలక బిల్లులను ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది.

Update: 2026-10-16 22:30 GMT

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఇపుడు ఒక బిగ్ టాస్క్ ని ఫేస్ చేస్తోంది. పార్లమెంట్ లో రెండు కీలక బిల్లులను ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. అయితే నంబర్లు అనుకూలిస్తున్నాయా లేదా అన్నదే చర్చ. ఎందుకంటె ఏప్రిల్ 17న జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఎన్డీయే ధీమాగా ప్రవేశపెట్టిన డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు అవసరమైన సంఖ్యా బలం లేక వీగిపోయాయి. మళ్ళీ ఆరు నెలల తరువాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి మరీ ఈ బిల్లులను నెగ్గించుకోవాలని బీజేపీ పంతం మీద ఉంది. అయితే అది సాధ్యమా అన్నదే ఇపుడు అంతటా సాగుతున్న చర్చ.

మూడింట రెండు వంతులు :

బీజేపీ ప్రతిపాదిస్తున్న రెండు బిల్లులు లోక్ సభలో ఆమోదం పొందాలి అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. లోక్ సభలో మొత్తం 540 కి పైగా ఎంపీలు ఉంటే అందులో రెండు వంతుల మెజారిటీ సాధించడం అంటే 360 ప్లస్ ఎంపీల మద్దతు అవసరం అని అంటున్నారు. ఇక ఎన్డీయేకు ప్రస్తుతం లోక్ సభలో బలం చూస్తే తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇరవై మంది ఎంపీలతో కలుపుకుంటే 319కి చేరింది. ఇక డీఎంకేని దారికి తెచ్చుకుంటే ఆ పార్టీ ఎంపీల మద్దతు 22 నంబర్ కలిసి 341 దాకా పెరుగుతుంది. అంటే ఇంకా మరో 20 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే దీని కోసం ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ మద్దతుతో పాటు మరిన్ని పార్టీల మద్దతుని బీజేపీ ఆశిస్తోంది. మరి ఈ లెక్కలు అన్నీ సరిపోతాయా బీజేపీకి ఆయా పార్టీలు సానుకూలంగా స్పందిస్తాయా అన్నది అయితే కీలకమైన మౌలికమైన ప్రశ్నగానే నిలిచి ఉంది.

ఊరిస్తున్న మ్యాజిక్ ఫిగర్ :

ఆరు నెలల క్రితం బీజేపీ లోక్ సభలో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులకు ఈసారి అయినా ఆమోదం కోసం కేంద్రంలోని ఎన్డీయే కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అప్పట్లో ఈ బిల్లుల ఆమోదానికి 54 ఓట్ల తక్కువ పడ్డాయి. అంటే ఇది ఇపుడున్న పరిస్థితుల్లో భారీ నంబర్ గానే చూస్తున్నారు. ఎన్డీయే ఇండియా కూటమి ఢీ అంటే ఢీ కొడుతున్న నేపథ్యం ఉంది. దాంతో ఒక్క ఓటు అటు నుంచి ఇటు తిరగడం కూడా కష్టంగా మారుతోంది అని అంటున్నారు ఈ నేపథ్యంలో ఎన్డీయే ఎంతగా తన బలాన్ని పెంచుకున్నా దగ్గరకు వచ్చి ఆగిపోతే మరోసారి అభాసుపాలు అవుతుందా అన్న చర్చ సాగుతోంది.

ఆకట్టుకునే ఫార్ములా :

అన్ని పార్టీలను అందరినీ ఆకట్టుకునేలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా యాభై పెంచేలా బీజేపీ కొత్త ఫార్ములా రచిస్తోంది. అంటే మొత్తం సీట్లు 543 నుండి 816కి పెరిగేలా బిల్లులో స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇస్తే మద్దతు ఇచ్చేందుకు ఎన్‌సీపీ శరద్ పవార్ వంటి పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. అలాగే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కూడా ఈ బిల్లుపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. అలా లోక్ సభలో బిల్లు గట్టెక్కించేందుకు ఎన్డీయే మార్గాలు వెతుకుతోంది.

రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ :

కేవలం లోక్ సభలోనే కాదు రాజ్యసభలోనూ ఈ బిల్లు మూండింట రెండు వంతుల ఎంపీల మద్దతుతో నెగ్గాలి. అక్కడ చూస్తే మ్యాజిక్ ఫిగర్ 164గా ఉంది. రాజ్యసభలో ఎన్డీయే బలం దాదాపు 150 కి చేరింది. డీఎంకేకు చెందిన 8 మంది ఎంపీల మద్దతు లభిస్తే ఈ సంఖ్య 158 కి చేరుతుంది. తృణమూల్ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలలో ఉప ఎన్నికలు జరిగితే బలం ఇంకా పెరుగుతుంది. చిన్న పార్టీల మద్దతుతో రాజ్యసభలో 2/3వ వంతు మార్కును దాటడం ఎన్‌డీఏకు పెద్ద కష్టం కాకపోవచ్చు అని అంటున్నారు. అలా అన్ని రకాలుగా అస్త్రాలను వ్యూహాలను రెడీ చేసుకుని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎన్డీయే ఈసారి నెగ్గేందుకు చూస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News