తులం బంగారం పంచాయితీ: కాంగ్రెస్ నేతలకు 'మెడ' మీద ముప్పు తెచ్చిన ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల హామీలు.. వాటి చుట్టూ తిరిగే విమర్శలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల హామీలు.. వాటి చుట్టూ తిరిగే విమర్శలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యుడు, బీజేపీ నేత పైడి రాకేశ్ రెడ్డి మాత్రం ఈ విమర్శల డోస్ కాస్త గట్టిగానే పెంచారు. "కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది కాబట్టి.. ఆ పార్టీ నాయకులు కనిపిస్తే వాళ్ల మెడల్లో ఉన్న బంగారమే లాగేసుకోండి" అంటూ ఆయన ఇచ్చిన క్రేజీ సలహా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం సలహా ఇచ్చి ఊరుకుంటే ఆయన రాజకీయ నాయకుడు ఎందుకవుతారు? "బంగారం లాక్కునే ప్రాసెస్ లో పోలీసులు కేసులు పెట్టినా భయపడకండి.. నేను చూసుకుంటా మీకు అండగా ఉంటా" అంటూ అభయహస్తం కూడా ఇచ్చేశారు. ఉచితంగా తులం బంగారం వస్తుందని ఆశపడ్డ మహిళల సంగతి పక్కన పెడితే, ఎమ్మెల్యే గారి స్టేట్‌మెంట్‌తో కాంగ్రెస్ లీడర్లు మాత్రం తమ మెడల్లో చైన్లు జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
శృతిమించిన హామీల యుద్ధం
రాకేశ్ రెడ్డి గారి డైలాగులు పేలడమే ఆలస్యం.. కాంగ్రెస్ శ్రేణులు తల పట్టుకున్నంత పనిచేశాయి. "సరే మా సంగతి పక్కన పెట్టండి.. ఎన్నికల టైంలో మీరు ఇచ్చిన 'రూపాయికే వైద్యం', సొంత పైసలతో ఇళ్ల నిర్మాణం హామీలు ఎక్కడికి పోయాయి సార్?" అంటూ సోషల్ మీడియా వేదికగా రివర్స్ ఎటాక్ మొదలుపెట్టాయి.
అయితే ఎమ్మెల్యే గారు మాత్రం తగ్గడం లేదు. "ప్రభుత్వం ఇళ్లు కట్టివ్వకపోయినా నా సొంత ఖర్చులతో, కేంద్ర వాటాతో కలిపి ఇప్పటికే 3,000 ఇళ్లు పూర్తి చేశా" అంటూ తన మార్క్ డెవలప్‌మెంట్‌ను గట్టిగానే వినిపిస్తున్నారు. మాట నిలబెట్టుకోవడంలో తనే నెంబర్ వన్ అని ఆయన చెప్పుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం అదంతా ఉత్తిదే అని కొట్టిపారేస్తోంది.
'చలో అంకాపూర్'.. ఆర్మూర్‌లో ఫుల్ టెన్షన్
ఈ 'గోల్డ్ మెడల్' వివాదం కాస్తా ముదిరి పాకాన పడటంతో ఎమ్మెల్యే గారిని నేరుగా నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ "చలో అంకాపూర్" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ఆర్మూర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి, ఆయన ఇచ్చిన హామీల లొసుగులను బయటపెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మా ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ యాక్షన్‌కు మాది డబుల్ రియాక్షన్ అంటూ క్యాడర్ అలర్ట్ అయ్యింది.
ప్రస్తుతం ఆర్మూర్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళం. శాంతిభద్రతలు చేజారిపోకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ముఠాలు బాహాబాహీకి దిగకుండా ఉండేందుకు ముందస్తు అరెస్టుల పర్వం కూడా మొదలైంది.
ఎన్నికల హామీల అమలు కోసం ప్రజలు కొట్లాడటం చూశాం కానీ ఇలా "నాయకుల మెడల్లో బంగారాలు లాగేసుకోండి" అని ఓ ఎమ్మెల్యేనే లైసెన్స్ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మరి ఈ 'గోల్డ్ వార్' లో కాంగ్రెస్ నేతలు తమ మెడలోని బంగారాన్ని ఎలా కాపాడుకుంటారు? ఈ "చలో అంకాపూర్" రచ్చ ఎంతవరకు వెళ్తుంది? అనేది ఆర్మూర్ రాజకీయాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..