విశాఖ మేయర్ సీటు...కుల సమీకరణలే కీలకం !

విశాఖ పెద్ద నగరం. పాతిక లక్షల జనాభా ఉంది. ఇక జీవీఎంసీ పరిధిలో అంటే అనకాపల్లి, భీమిలీ దాకా విస్తరించింది.

Update: 2026-09-08 03:26 GMT

విశాఖ పెద్ద నగరం. పాతిక లక్షల జనాభా ఉంది. ఇక జీవీఎంసీ పరిధిలో అంటే అనకాపల్లి, భీమిలీ దాకా విస్తరించింది. దాంతో జీవీఎంసీ పరిధి మరింతగా పెరిగింది. భీమిలి, అనకాపల్లి వంటి ప్రాంతాల విలీనంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా జీవీఎంసీ వార్డుల సంఖ్యను గతంలో 98 కి పెంచగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన వార్డులను పునర్ విభజించి వాటి సంఖ్యను 120 వార్డులకు పెంచే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దాంతో చాలా మంది ఆశావహులు రంగంలోకి దిగుతున్నారు. అంతే కాదు కులాల సమీకరణలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు.

బీసీ వర్గాల పట్టు :

జీవీఎంసీలో వివిధ సామాజిక వర్గాలు ఉన్నాయి. అందులో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. యాదవులు, వెలమలు, గవరలు, మత్స్యకారులు తూర్పు కాపులు ఇలా ప్రధానంగా ఉంటారు. వీరిలో చూస్తే యాదవులు గణనీయంగా ఉన్నారు. దాంతోనే ఇప్పటికి రెండు పర్యాయాలు వారికే మేయర్ పీఠం దక్కింది. ఈసారి బీసీలలో మిగిలిన సామాజిక వర్గాలకు ఇవ్వాలని ఒక వైపు డిమాండ్ ఉంది. మరో వైపు చూస్తే బలమైన సామాజిక వర్గంగా తమకే చాన్స్ ఇవ్వాలని యాదవులు కోరుతున్నారు. తాము మొత్తం నగర జనాభా మూడు నుంచి నాలుగు లక్షలుగా ఉన్నామని వారు చెబుతున్నారు. అంటే 18 శాతం ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని తమకు అవకాశాలను ఇవ్వాలని యాదవులు కోరుతున్నారు.

ఓసీలకు కేటాయించాలని :

మరో వైపు చూస్తే నాలుగు దశాబ్దాల నుంచి విశాఖ మేయర్ సీటు బీసీలకే కేటాయిస్తున్నారని ఈసారి ఓసీలకు ఇవ్వాలని కూడా ఇంకో డిమాండ్ తెర మీదకు వస్తోంది. ఓసీ కాపులు కూడా విశాఖలో పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు వైశ్యులు ఇతరులు అంతా మేయర్ పదవిని అధిష్టించేందుకు వీలుగా ఓసీకే వీలుకల్పించాలని అంటున్నారు. ఓసీ మేయర్ అయితే కేవలం రాజకీయ పార్టీల నుంచే కాకుండా తటస్థులకు కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. గతంలో డీవీ సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదికి టీడీపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఆయన ప్రతిష్టతో విశాఖకు ఎంతో పేరు వచ్చిందని అలాగే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా విశాఖ మేయర్ సీటు విషయంలో ప్రయోగం చేయాలని అంటున్నారు.

అన్నింటికీ అతీతంగా :

విశాఖ మెట్రో పాలిటిన్ సిటీగా ఎదుగుతోంది. అన్ని వర్గాల ప్రాంతాల సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. విశాఖలో ఉత్తరాది నుంచి వచ్చిన వారు కూడా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక విశాఖ చుట్టూ అభివృద్ధి పెద్ద ఎత్తున సాగుతోందని దాంతో విశాఖ మేయర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి రాజకీయాలకు ప్రాంతాలు కులాలకు అతీతంగా అందరికీ ఆమోద యోగ్యులైన వారికి టికెట్ ఇస్తే విశాఖ ప్రజలు ఆదరించి ఓటేస్తారు అని అంటున్నారు. ఈ విషయంలో అధికారంలో ఉన్న కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు అని అంటున్నారు. విపక్షం అయితే బీసీ కార్డుతో ముందుకు రావాలని చూస్తోంది.

Tags:    

Similar News