బండి సవాల్.. ఓడితే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని.. దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టటంతో పాటు వాటిని తొలగించాలన్న బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-08-27 09:16 GMT

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతో బీజేపీ ఎంపీలు గెలిచారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే.. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని పేర్కొంటూ.. ‘ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి.. నేను విసిరిన సవాలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?’ అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని.. దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టటంతో పాటు వాటిని తొలగించాలన్న బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేసింది పెద్దలే అయినా.. వారి చేత ఓటు వేయించింది మాత్రం పిల్లలేనని పేర్కొన్నారు. వారికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే తాను సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

మోడీ గిఫ్ట్ పేరుతో ఆయన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లోని జిల్లా పరిషత్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ లో ఒక ఓటు.. జగిత్యాలలో మరో ఓటు.. చొప్పదండిలో ఇంకో ఓటు వేయటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన బండి సంజయ్.. ‘లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు నన్ను 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దొంగ ఓట్లు అనటం ప్రజల్ని అవమానించటమే. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.

మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు.. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎనిమిది మంది ఎంపీలను అవమానించేలా మాట్లాడారన్నారు. మహేశ్ కుమార్ చెప్పినట్లుగా దొంగ ఓట్లతో బీజేపీ గెలిచేదే నిజమైతే.. కర్ణాటక.. తెలంగాణ.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలకు ఓటరు కార్డులు.. రేషన్ కార్డులు.. ఇళ్లను ఇస్తూ వారిని పెంచి పోషిస్తున్నది ఎవరు? అని సూటిగా ప్రశ్నించారు. మరి.. బండి విసిరిన సవాలుకు ఎవరు రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News