బీహార్ ఎన్నిక‌లు - ఏపీ నేత‌లు ఏం నేర్చుకోవాలి ..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దక్కించుకుంది. కనీవిని ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకుంది.;

Update: 2025-11-17 03:30 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దక్కించుకుంది. కనీవిని ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకుంది. వాస్తవానికి 157 నుంచి 170 సీట్లు మాత్రమే దక్కించుకుంటారని సర్వే సంస్థలు చెప్పినప్పటికీ 208 స్థానాల్లో ఎన్డీఏ విజయం దక్కించుకుంది. అయితే, దీని నుంచి ఏపీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆది నుంచి పార్టీలో పని చేయని నాయకులు అదేవిధంగా ప్రజలను పట్టించుకోని నాయకులు బీహార్‌ ఎన్నికల నుంచి చాలా నేర్చుకోవాలి.

ఎందుకంటే బీహార్ లో ఎన్డీఏ కూటమి చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. ప్రజలకు ఎవరైతే చేరువగా ఉంటారో ప్రజల్లో ఎవరైతే ప్రభావం చూపించగలరో వారిని మాత్రమే ఎంపిక చేసి టికెట్లు ఇచ్చింది. ``సుదీర్ఘకాలంగా మేము ప్రజల్లో ఉన్నాం. సుదీర్ఘకాలంగా మాకు ఓటు బ్యాంకు ఉంది. కులాలు మతాలు, సామాజిక వర్గాల వారీగా మేము బలంగా ఉన్నాం.`` అని చెప్పుకున్నప్పటికీ ప్రజల్లో ఏ చిన్న వ్యతిరేకత కనిపించినా అటు బిజెపి ఇటు జేడీయు పార్టీలు ఆయా నాయకులను పక్కన పెట్టేసాయి. అంతేకాదు ఇదే సమయంలో కొత్తవారికి అవకాశం కల్పించారు.

ఈ విషయం రాష్ట్రంలో ఉన్న టిడిపి, వైసీపీ నాయకులకు చాలా ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉంది. వివాదాలు, విమర్శలతో కాలం గడిపే కొంతమంది ఎమ్మెల్యేలు(అధికార‌, విప‌క్షాలు కూడా) కొంతమంది నాయకులకు బీహార్ ఎన్నికలకు గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని బీహార్లో కచ్చితంగా పక్కన పెట్టారు. అంతేకాదు, వారు నిరసనలు చేసినా ధర్నాలు చేసినా తమకు టికెట్ కావాలని యాగి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత నిర్దిష్టంగా అయితే కూటమి ముందుకు సాగింది అన్నది గమనిస్తే రాష్ట్రంలో కూడా నాయకులు ఆ విధంగా తమను తాను మలుచుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా ``మేమే గొప్ప. మమ్మల్ని బట్టే పార్టీలు ఉన్నాయి.`` అనుకునే నాయకులకు బీహార్ ఎన్నికలు మరింత కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఈ విధంగా భావించిన నాయకులను నిర్ద్వంద్వంగా పక్కన పెట్టారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని విర్రవీగిన నాయకుల‌ను కూడా పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఫలితంగా ఎన్డీఏ అనూహ్య‌మైన విజయాన్ని దక్కించుకుంది. ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలంటే నాయకులు ఎప్పటి నుంచైనా తమను తాను తీర్చిదిద్దుకునే దిశగా అడుగులు వేయాలి. ప్రజలకు పార్టీలకు మధ్య వారధిగా నిలవాలి.

Tags:    

Similar News