ఛార్జ్ చేస్తే 100కి.మీ. కారు.. ధర మాత్రం రూ.లక్షేనట

కొన్నిసార్లు అంటే.. అద్భుతాలు అలా ఆవిష్క్రతమవుతుంటాయి. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందిందే.;

Update: 2026-01-10 04:19 GMT

కొన్నిసార్లు అంటే.. అద్భుతాలు అలా ఆవిష్క్రతమవుతుంటాయి. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందిందే. ఒక చిన్న దుకాణానికి యజమాని అయిన ఒక మధ్యవయస్కుడు అనూహ్య రీతిలో వార్తల్లోకి వచ్చేశాడు. దీనికి కారణం తనకున్న అవగాహనతో రూ.లక్ష ఖర్చుతో ఐదుగురు కూర్చొని ప్రయాణించేందుకు వీలైన ఎలక్ట్రికల్ కారును సిద్ధం చేశాడు. అతడు తయారు చేసిన కారుకున్న మరో ప్రత్యేకత ఏమంటే.. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించటం. వ్యవసాయ అవసరాలు తీర్చేలా రూపొందించిన ఈ వాహనం.. అక్కడి చుట్టుపక్కల హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఆ కారేంటి? దాన్ని తయారు చేసిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? లాంటి వివరాల్లోకి వెళితే..

బిహార్ కు చెందిన ముర్షిద్ ఆలం అనే వ్యక్తి చిన్న షాపు. అందులో వాహనాల్ని రిపేర్ చేస్తుంటాడు. తన గ్యారేజీకి వచ్చే వారిలో ఎక్కువమందికి అవసరయ్యే వాహనాన్ని తయారు చేయాలన్న ఆలోచన అతడికి వచ్చింది. చిన్న వ్యాపారులు.. రైతులకు ఉపయోగపడేలా వాహనాన్ని రూపొందించాలని భావించాడు.

ఇందులో భాగంగా అందరికి అందుబాటులో ఉండేలా ఎలక్ట్రికల్ కారును సిద్ధం చేశాడు. అది కూడా పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మీ. వరకు ప్రయాణించే జీప్ ను సిద్ధం చేశాడు. ఈ కారును వినియోగించిన వారంతా దీనికి దేశీయ టెస్లాగా అక్కడోళ్లు వ్యవహరిస్తున్నారు. ట్యూబ్ లెస్ టైర్లతో పాటు..స్పీడో మీటర్.. పవర్ స్టీరింగ్, ఛార్జింగ్ పాయింట్ తదితర ఫీచర్లు ఉన్న ఈ కారు.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందన్నది చర్చగా మారింది. ఇలాంటి ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించేలా కేంద్రం కాస్త సీరియస్ గా ఫోకస్ పెడితే.. అతి తక్కువ ధరకే కారు రూపొందే వీలుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News