చెడుని తీసి భోగి మంటల్లో వేసేయ్ !

మనిషికి ఎన్నో వేల లక్షల అలోచనలు మెదడుతో పుడతాయి. అందులో మంచితో పాటుగా చెడు తలపులూ ఎక్కువగానే ఉంటాయి.;

Update: 2026-01-13 21:01 GMT

మన పండుగలు ఎంతో విశేషాన్ని కలిగి ఉంటాయి. ప్రతీ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాటి వెనక ఎంతో గొప్ప సందేశం కూడా ఉంటుంది. భోగీ పండుగ గురించి చెప్పుకుంటే పాత సామాను చెత్త అంతా తెచ్చి మంటలలో వేస్తారు. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం. మరి అలా ఎందుకు చేయాలి అని ఎవరూ తాత్వికతతో ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేసి ఉండరు. కానీ నిజంగా ఆలోచిస్తే దీని వెనక గొప్ప సందేశం ఉంది అని అర్ధం అవుతుంది.

నీలోనే చెడుగు :

ప్రతీ మనిషీ నూరు శాతం మంచి వాడు కాదు, ఎక్కడో చెడు ఉంటుంది. చెడు ఆలోచనలు ఉంటాయి. అవి అసూయ ద్వేషం, కోపం, క్రోదం స్వార్ధం లాంటివి అని చెప్పుకోవాలి. ఎంతసేపూ పక్క వాడి మీద పడి ఏడవడం తనకే అన్నీ దక్కాలని స్వార్ధంతో ఆలోచించడం తన కంటే ఒక అడుగు ముందు ఉన్న వాడి మోకాలు అడ్డే ప్రయత్నం చేయడం ఇలా చాలానే దోష గుణాలు ఉంటాయి. వాటిని ఒక్కోటిగా తీసివేస్తూ ముందుకు పోతే విజయం దక్కుతుంది, మనిషి కూడా మరింత సాత్వికుడు అవుతాడు. ఎందుకంటే ఈ సమాజంలో నీవు ఒకడివి తప్ప మొత్తం సమాజం కానే కాదు కాబట్టి. అందుకే అందరితో కలవాలీ అంటే అందరినీ నీ వారుగా చేసుకోవాలీ అంటే కూడా చెడుగుని నీ నుంచి తొలగించుకోవాల్సిందే.

దుష్ట తలుపులు సైతం :

మనిషికి ఎన్నో వేల లక్షల అలోచనలు మెదడుతో పుడతాయి. అందులో మంచితో పాటుగా చెడు తలపులూ ఎక్కువగానే ఉంటాయి. అన్నీ చేస్తారని కాదు కానీ చేసేలా ప్రేరణ చేసే చెడు తలంపులను సైతం తీసి మడత పెట్టి భోగీ మంటలలో వేయమని పెద్దలు చెబుతున్నారు. అందుకే భోగీ మంటలను తెచ్చి ఏర్పాటు చేసింది. అంతే తప్ప ఎదుటి వారి పక్క వారి ఇంటి నుంచి తలుపు చెక్కలు దొంగిలించి తీసుకుని వచ్చి నీ ఇంటి ముందు మంట వేసుకోవడం కాదు, అలా చేస్తే నీ చెడుని మరింతగా పెంచుకుంటూ పోతున్నట్లే లెక్క.

మంటలోనే అంతా :

నిప్పు గొప్పది, అది రూపు లేకుండా చేస్తుంది, ఉనికి లేకుండా కూడా చేస్తుంది. బూడిదగా మిగులుస్తుంది. అసలు నీవేమిటో ఈ ఆది అంతం ఏమిటో కూడా చెబుతుంది. అలా మంటలో ఎంతో వేదాంతం వైరాగ్యం ఉన్నాయి. అందుకే భోగీ మంటలో నీలో నీవి కాకూడనివి అన్నీ తెచ్చి పడేయి. అప్పుగా తీసుకుంటే అలాంటి చెడ్డ బుద్ధులు కూడా వదిలించేసుకో. ఆ మీదట ఎగిసి పడుతున్న భోగీ మంట ఎంత నిర్మలంగా పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుందో అలా నీవు కూడా ఉంటావు. మంచి దారిలో నడిచేందుకు భోగీ మంట సాక్షిగా అగ్ని సాక్షిగా ప్రమాణం కూడా చెయ్. ఆ మీదట మిగిలిన రోజులు అన్నీ పండుగ రోజులే ప్రతీ దినం నీవు ఇంకా ఎత్తుకు ఎదిగేందుకు దోహదపడే నిచ్చెన మెట్లుగానే ఉంటాయి. అందుకే భోగీ అంటే ఒక భోగంగా చూడొద్దు, తాత్వికంగా చూస్తూ ముందుకు సాగినపుడే మనిషిగా నీవేంటో నీకు బాగా తెలుస్తావు.

Tags:    

Similar News