'ఎంకి పెళ్లి సుబ్బి చావు'... టైటిల్ జస్టిఫికేషన్ అయిన వేళ..!
ఇందులో భాగంగా... గుడిలో పూజారుల సమక్షంలో వివాహాలు చేసుకున్న కొన్ని జంటలు విడాకుల విషయంలోనూ వారి సహాయం కోరుతున్నారంట.;
పెళ్లంటే భూదేవంత పీట వేసి, ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా చేసుకునే వాళ్లు కొందరైతే... పెద్దలు అంగీకరించకో, పరిస్థితులు కలిసిరాకో గుడిలోనో, రిజిస్ట్రార్ ఆఫీసులోనో చేసుకునేవారు కొందరు. ఎవరు అక్కడ చేసుకున్నా.. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, పిల్లాపాపలతో కలిసి ఉండాలనే ఆశీర్వాదాలు కామన్! అలా అని అన్ని ఆశీర్వాదాలు సక్సెస్ అవుతాయని కాదు కానీ..!
ఎందుకంటే ఇటీవల వివాహాలతో పోటీగా విడాకుల సంఖ్యా పెరుగుతుంది. దంపతుల మధ్య ప్రతీ చిన్న సమస్యకూ విడాకులే పరిష్కారం అనుకునే ఆలోచనలు పెరుగుతున్నాయని అంటున్నారు. మళ్లీ ఇందులో మ్యూచువల్ గా, ప్రశాంతంగా విడాకులు తీసుకునేవారు కొందరైతే... 498/ఏ సెక్షన్ తో విడాకులు తీసుకునేవారు ఇంకొందరు! ఇక్కడ మాత్రం సమస్య మూడోరకంగా.. పెళ్లిళ్లు చేసిన పూజారులకు రావడం గమనార్హం.
అవును... ఎంకి పెళ్లి సుబ్బి చావు తరహాలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గుడిలో పూజారుల సమక్షంలో వివాహాలు చేసుకున్న కొన్ని జంటలు విడాకుల విషయంలోనూ వారి సహాయం కోరుతున్నారంట. అలా అని ఏదో పెద్ద మనుషుల సమక్షంలోనో.. లేక, వారిని తిరిగి కలపడంలో మాటసాయంలోనో కాదు సుమా.. కోర్టులో సాక్ష్యం చెప్పడానికంట.
వివరాళ్లోకి వెళ్తే.. బెంగళూరులోని సోమేశ్వర ఆలయ పూజారులకు సరికొత్త సమస్య వచ్చి పడిందంట. ఇందులో భాగంగా... పెళ్లిళ్లకు, ప్రధానంగా ప్రేమ పెళ్లిళ్లకు ఫేమస్ అనే పేరు సంపాదించుకున్నట్లు చెబుతున్న ఈ ఆలయంలో వివాహాలు చేసుకున్నవారు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారంట. అంతవరకూ వారి ఇష్టాఇష్టాలు వారివే కానీ.. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుందంట.
ఈ క్రమంలో... విడాకుల విషయంలోనూ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని.. పూజారులను సదరు జంటలు అడుగుతున్నాయంట. దీంతో... అటు తాము వివాహాలు చేసిన జంటలు విడిపోతున్నాయని కొందరు ఫీలవుతుంటే.. పెళ్లి చేసిన పాపానికి కోర్టు మెట్లెక్కడం ఏమిటో అని మరికొందరు హర్ట్ అవుతున్నారంట! దీంతో.. ఇకపై ఈ ఆలయంలో వివాహాలు చేయము మొర్రో అని పూజారులు చెబుతున్నారని అంటున్నారు.