బెంగళూరు గ్రామంలో 'పాకిస్తాన్ జిందాబాద్'!... అసలేం జరిగింది..!

అవును... బెంగళూరు శివార్లలోని జిగాని పోలీసు పరిధిలోని కల్లుబాలు గ్రామంలో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.;

Update: 2025-10-30 04:20 GMT

భారతదేశంలో ఉంటూ.. ఈ నేలపైన గాలి పీలుస్తూ.. తామూ భారతీయులమని చెప్పుకుంటూ జీవిస్తున్న వారు.. పక్కనున్న శత్రువు పాకిస్తాన్ కు వంతపాడుతూ మాతృభూమికి వెన్నుపోటు పొడుస్తున్నవారు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ బ్యాచ్ వ్యవహారం బట్టబయలైంది.

ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నవారు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ అనే ముసుగు కప్పుకున్నవారు.. సైనిక సంస్థల్లో పని చేస్తున్నవారు సైతం ఈ దారుణాలకు ఒడిగట్టిన పరిస్థితి. ఇలాంటి బ్యాచ్ ను పోలీసులు పట్టుకున్నారు! దీంతో దేశంలో ఉన్న వెన్నుపోటు దారుల వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ సమయంలో తాజాగా మరో ఘటన తెరపైకి వచ్చింది.

అవును... బెంగళూరు శివార్లలోని జిగాని పోలీసు పరిధిలోని కల్లుబాలు గ్రామంలో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆ ప్రాంతంలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే యూజర్ ఐడితో మొబైల్ వై-ఫై నెట్‌ వర్క్ కనిపించింది. దీంతో నివాసితులలో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఆ పేరుతో వై-ఫై యూజర్ ఐడీని గమనించిన స్థానికులు షాక్ అయ్యారని.. ఆ ప్రాంతంలో దేశ వ్యతిరేక లేదా ఉగ్రవాద శక్తులు ఉన్నాయని అనుమానించారని తెలుస్తోంది. గోవర్ధన్ సింగ్ అనే వ్యక్తి జిగాని పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కల్లుబాలు సహకార బ్యాంకు ఆవరణలో ఈ వై-ఫై కనెక్షన్ గుర్తించబడిందని ఫిర్యాదులో ఆరోపించారు.

ఇదే సమయంలో... బాధ్యులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు జిగాని పోలీస్ స్టేషన్‌ ను సంప్రదించడంతో ఈ విషయం త్వరగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో.. వై-ఫై నెట్‌ వర్క్ మూలాన్ని గుర్తించడానికి వారు నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్.సీ.ఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని పోలీసులు తెలిపారు.

అయితే... బ్యాంకు వై-ఫై మరమ్మతులో ఉందని, స్థానిక టెక్నీషియన్‌ ను సర్వీస్ కోసం పిలిపించారని తెలుస్తోంది. మార్చబడిన యూజర్ ఐడీని గుర్తించే సమయానికి సదరు టెక్నీషియన్ అప్పటికే బ్యాంకు నుండి వెళ్లిపోయాడని.. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉందని.. దీంతో మరింత అనుమానానికి దారితీసిందని అంటున్నారు. ఆ టెక్నీషియన్ ఇంకా పోలీసులకు దొరకలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News