బాలినేనికి ఎమ్మెల్సీ.. ఏం జరిగింది ..!
సీనియర్ పొలిటీషియన్ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం జనసేన లో ఉన్నారు. అయితే ఆయనకు పెద్దగా ప్రాధాన్యం అయితే లభించడం లేదు.;
సీనియర్ పొలిటీషియన్ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అయితే ఆయనకు పెద్దగా ప్రాధాన్యం అయితే లభించడం లేదు. గత ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనంతరం ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. జనసేన కండువా కప్పుకున్నారు. కానీ బాలినేని పై ఇటు జనసేన అటు టిడిపి నాయకుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత కొనసాగుతోంది. దీనిని తగ్గించేందుకు బాలినేని ప్రయత్నం చేస్తున్నారు.
అయినప్పటికీ కొందరు నాయకులు ఆయనపై వ్యతిరేక ప్రచారం అదేవిధంగా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యం పెంచడం తో పాటుగా... ఎమ్మెల్సీ పదవిపై కూడా ఆయన చర్చించినట్లు తెలిసింది. వాస్తవానికి గతంలోనే బాలినేనికి ఎమ్మెల్సీ ఆఫర్ చేశారన్న వాదన తెరమీదకు వచ్చినప్పుడు ఆయన వద్దన్నట్టుగా వార్తలు వచ్చాయి.
తన స్థాయికి తగదని ఆయన వ్యాఖ్యానించినట్టు జనసేన వర్గాలు కూడా చెప్పాయి. కానీ, ఇప్పుడు పదవి లేకపోవడంతో తనకు ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదని, పార్టీలోనూ అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా తనకు ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడుతున్నాయని బాలినేని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపద్యంలో పవను కలిసిన ఆయన ఎంఎల్సీ పదవి ఇవ్వాలని కోరినట్టు ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితులో ఎమ్మెల్సీ పోస్ట్ కోసం చాలామంది లైన్ లో ఉన్నారు.
అయితే జనసేన తరఫున బాలినేనికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ పదవులు కూడా ఖాళీ లేకపోవడం వచ్చే ఎన్నికల వరకు ఆగడం లేదా ఇటీవల రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల సీట్లు ఖాళీ అయితే వాటిలో ఒకటి బాలినేనికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయం జనసేనలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి.