జగన్ మీద కోపాన్ని కంటిన్యూ చేస్తున్న మాజీ మంత్రి !

వైసీపీ మాజీ నాయకుడు జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-05-12 03:46 GMT

వైసీపీ మాజీ నాయకుడు జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం తాను ఎంతో చేశాను అని చెప్పారు. 2009లో మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తాను జగన్ కోసం త్యాగం చేసి మరీ వైసీపీలో చేరాను అని గుర్తు చేసుకున్నారు. అయితే వైసీపీలో మాత్రం తాను ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన మంత్రి పదవి పోయేందుకు కూడా కారణం ఉందని ఆయన ఒక సీక్రెట్ అయితే బయటపెట్టారు.

అందుకే తీసేశారు :

తాను వైసీపీలో ఉన్నపుడు పార్టీలో జరిగే తప్పులను ఎప్పటికపుడు ప్రశ్నిస్తూ ఉండేవాడిని అని ఆయన చెప్పారు. అదే జగన్ కి నచ్చేది కాదని అన్నారు. జగన్ ఎపుడూ బహిరంగ సభలలో తన గురించి మాట్లాడింది లేదని కూడా బాలినేని నిందించారు. తాను వైసీపీ కోసం తన సొంత డబ్బులు ఖర్చు చేశాను అని అయితే వైసీపీ మాత్రం రాజకీయంగా తనను అణచివేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైసీపీలో ఉన్నా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రోజూ తనను విమర్శించలేదు సరికదా బాలినేని లాంటి మంచి వారు వైసీపీలో ఉన్నారని చెప్పారని బాలినేని గుర్తు చేశారు.

జనసేనలో చేరిక ద్వారా :

తాను ఎపుడూ ప్రశ్నించే తత్వంతో ఉండే నాయకుడిని అని ఆయన అన్నారు. వైసీపీలో అలా ప్రశ్నించే వారికి చోటు లేదని ఆయన అన్నారు. అందుకే పవన్ లాంటి వారి నాయకత్వంలో జనసేనలో చేరాను అని అన్నారు. తాను ఏ పదవులూ కోరుకోవడం లేదని ఆయన అన్నారు. ఒంగోలు జిల్లాలో జనసేనను పటిష్టంగా మారుస్తాను అని బాలినేని చెప్పారు ప్రతీ నియోజకవర్గం తిరిగి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పెద్ద పీట వేస్తామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు ఏమిటి, స్థానిక పరిస్థితులు జనసేన బలాలు నాయకుల గురించి అన్ని వివరాలతో నివేదికను అధినాయకత్వానికి పంపిస్తాను అని బాలినేని చెప్పారు

వైసీపీలోకి మళ్ళీ :

ఇదిలా ఉంటే తాను మళ్ళీ వైసీపీలోకి వెళ్లేది లేదని బాలినేని స్పష్టం చేశారు. తనను కావాలనే వైసీపీ టార్గెట్ చేస్తోంది అని ఆయన అన్నారు. తాను వైసీపీలో రేపో మాపో చేరిపోతున్నాను అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. జనసేనకు తనకు అన్యాయం జరిగినా న్యాయం జరిగినా వైసీపీకి సమస్య ఏమిటి ఎందుకు వారికి బాధ అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తాను గతం కంటే ఎక్కువగా కష్టపడతాను అని బాలినేని అంటున్నారు. అదే సమయంలో జగన్ మీద కోపాన్ని అలాగే మాజీ మంత్రి ఉంచుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News