వైసీపీ వదలదు.. జనసేన పట్టించుకోదు.. ట్రెండింగ్ లోనే బాలయ్య ఎపిసోడ్

బాలయ్య ఎపిసోడ్ పై అధికార కూటమిలోని ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, జనసేన ఆత్మరక్షణకు లోనై వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకున్నాయి.;

Update: 2025-09-30 10:03 GMT

బాలయ్యా ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. గత వారం (25 సెప్టెంబరు) అసెంబ్లీ చర్చలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావనపైనా ఆయన కాస్త కటువుగా స్పందించారు. దీంతో బాలయ్యపై వైసీపీ కౌంటర్ అటాక్ తీవ్రం చేసింది. బాలయ్య అసెంబ్లీ మాట్లాడిన రోజు నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది మరోవైపు బాలయ్యను బూచిగా చూపి టీడీపీ-జనసేన మధ్య పొత్తును చిత్తు చేసే ప్లాన్ ను అమలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ఎపిసోడ్ పై అధికార కూటమిలోని ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, జనసేన ఆత్మరక్షణకు లోనై వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకున్నాయి. ఈ విషయంలో విపక్షానికి అవకాశం ఇవ్వకూడదని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంతలా రెచ్చగొడుతున్నా, బాలయ్య అసెంబ్లీ ఫైర్ పై టీడీపీ, జనసేన నుంచి ఎవరూ మాట్లాడటం లేదు. అయినా వైసీపీ వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో జనసైనికులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

బాలయ్య మాట్లాడిన మాటలపై మెగాస్టార్ చిరంజీవి, ఆయన అభిమానులు కౌంటర్ ఇవ్వడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నా, జనసేన నుంచి ఈ విషయంమై ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాకపోవడమే ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బాలయ్య విరుచుపడినా, ఎవరూ స్పందించకపోవడానికి కారణమేంటి అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ స్పందన ఆశిస్తున్నట్లు వైసీపీ సోషల్ మీడియా పోస్టులను బట్టి అర్థమవుతోందని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవిని తాము గౌరవిస్తే, కూటమి ప్రభుత్వం అవమానించిందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. దాదాపు ఐదు రోజులుగా ఈ వివాదాన్ని హైలెట్ చేస్తూ వైసీపీ క్యాంపెయిన్ కొనసాగుతోంది. అయితే విపక్షం ఎంత రెచ్చగొట్టినా జనసేన మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుండమే ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా జనసేన కీలక నేతలు ఎవరూ మాట్లాడకపోవడంతో వైసీపీ వ్యూహం పారడం లేదని అంటున్నారు. జనసేనాని పవన్ తోపాటు ఎమ్మెల్సీ నాగబాబు సైతం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని వివాదం పెద్దది కాకుండా చూసుకోవడం చర్చకు దారితీస్తోంది. దీంతో ఐదు రోజులుగా బాలయ్య ఎపిసోడ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News