20 ఎకరాల భూకబ్జా ఆరోపణలు.. కవిత, భర్త అనిల్‌, ఏవీ రెడ్డిపై స్థానికుల ఫిర్యాదు!

హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిపై భారీ స్థాయిలో భూకబ్జా జరిగిందని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.;

Update: 2025-10-25 06:20 GMT

హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిపై భారీ స్థాయిలో భూకబ్జా జరిగిందని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డి కలిసి ఈ వ్యవహారంలో భాగస్వాములని స్థానికులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి బాధితులు ఈ విషయాన్ని ఫిర్యాదుగా తెలియజేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి బాలానగర్ మండలంలోని సర్వే నంబర్ 2010/4లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వారు తెలిపారు.

* ₹2,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి!

స్థానికులు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఈ భూమి విలువ సుమారు ₹2,000 కోట్లకు పైగా ఉంటుంది. కూకట్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయ పరిధిలో ఉన్న ఈ భూమి ఇప్పుడు కవిత భర్త అనిల్ పేరుతో నమోదైందని, అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఫ్లాట్లు నిర్మించి అమ్మకాలు మొదలయ్యాయని వారు ఈటల దృష్టికి తీసుకెళ్లారు.

* ఓవర్‌ల్యాప్ సర్వే నంబర్ల ఆధారంగా కబ్జా?

ఓవర్‌లాపింగ్ సర్వే నంబర్లను ఆధారంగా చేసుకుని భూకబ్జా జరిపారని స్థానికులు ఆరోపించారు. ఇందులో ఏవీ రెడ్డి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి.

* అధికారులు నిర్లక్ష్యం – ప్రజలు ఆగ్రహం

“మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, కలెక్టర్‌ వంటి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అని స్థానికులు ఆరోపించారు.. ఈ భూమిని కాపాడి, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజోపయోగ నిర్మాణాలకు వినియోగించాలని వారు ఈటల రాజేందర్‌ను కోరారు.

*ఈటల హామీ

ఫిర్యాదు స్వీకరించిన ఈటల రాజేందర్, ప్రభుత్వ భూమిని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ప్రజల భూమిని ఎవరు కాజేయనీయం,” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

రాజకీయ మలుపు

బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చి ‘జాగృతి’ పేరిట ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో, భూకబ్జా ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఫిర్యాదుల వెనుక ఈటల రాజేందర్ వ్యూహం ఉందా అనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వ్యవహారం కావడంతో ఆయన సీరియస్ గా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాలానగర్ భూకబ్జా వ్యవహారం త్వరలోనే పెద్ద రాజకీయ తుఫాన్‌కు దారితీయవచ్చని అంచనా. కవిత, అనిల్, ఏవీ రెడ్డి పేర్లు ఈ వ్యవహారంలో వినిపించడం తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.

Tags:    

Similar News