తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే...?
ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముని భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సమయం దగ్గరపడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముని భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సమయం దగ్గరపడుతుంది. ఇందులో భాగంగా... జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అనంతరం... జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించే అవకాశం కల్పించారు.
దీంతో బాల రాముని దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు.. అయోధ్యకు వెళ్లడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో రోడ్డు మార్గం, రైలు మర్గం, వాయు వార్గాలలో అయోధ్యకు ఎలా చేరాలనేది ఇప్పుడు చూద్దాం...!
రోడ్డు మార్గం:
హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే... సుమారు 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బయలుదేరితే.. సుమారు 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ.6 వేలు వరకూ ఉంటుంది.
హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్ రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది బాగా వ్యయప్రయాసలతో కూడిన ప్రయాణం అని చాలా మంది భావిస్తుంటారు!
రైలు మార్గం:
రైలు మార్గం ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సుల ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. ఇందులో భాగంగా... ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి గోరఖ్ పూర్ కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో సుమారు 30 గంటల పాటు ప్రయాణం చేయాలి.
ఇదే క్రమంలో... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి సోమ, ఆదివారాలలో బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉంటుంది! అంటే... హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి ఆది, సోమ, శుక్ర వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుందన్నమాట!
వాయు మార్గం:
విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే వారు... హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని.. అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు.