మునీర్ కు ఆఫ్గన్ హెచ్చరికలు... భారత్ పై మునీర్ పిచ్చి ప్రేలాపనలు!

పహల్గాం ఉగ్రదాడికి పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ వ్యాఖ్యలే కారణమనే చర్చ నాడు బలంగా జరిగిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-18 11:59 GMT

పహల్గాం ఉగ్రదాడికి పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ వ్యాఖ్యలే కారణమనే చర్చ నాడు బలంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పడంలో అతడు దిట్ట అని చెబుతారు. ఆ దేశానికి అనధికారిక నియంత అనేది అంతర్జాతీయ మీడియా సైతం నొక్కి చెప్పే మాట! ఈ క్రమంలో మునీర్ పై ఆఫ్గాన్ మాజీ ఎంపీ నిప్పులు కక్కారు. మరోవైపు భారత్ పై మునీర్ కారు కూతలు కూశారు.

అవును... పాకిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మళ్లీ ఘర్షణలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అఫ్గాన్‌ లోని పాక్టికా ప్రావిన్స్‌ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్లు సహా సుమారు 8 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్ మునీర్‌ పై అఫ్గాన్‌ మాజీ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నీ కొంపనే కాల్చేస్తోంది మునీర్!:

ఆఫ్గాన్ పై పాకిస్థాన్ చేసిన తాజా వైమానిక దాడులపై అఫ్గాన్‌ మాజీ ఎంపీ మరియం సోలైమాంఖిల్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ ది పిరికి చర్య అంటూ దాడులను తీవ్రంగా ఖండించారు. వాళ్లు చేసే దాడుల్లో యువ క్రికెటర్లు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమని అంటూ.. అసీమ్ మునీర్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇందులో భాగంగా... అటు భారత్‌, ఇటు అఫ్గాన్‌ పై పాకిస్థాన్ నిఘా సంస్థ ఐ.ఎస్‌.ఐ, దాని సైన్యం దశాబ్దాలుగా ఇదే హింసకు పాల్పడుతోందని.. దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పెంచి, వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే... 'మీరు ఎగదోసిన మంటే.. మీ సొంత ఇంటిని (పాక్) కాల్చేస్తోందనే విషయం గుర్తుపెట్టుకోండి' అని వ్యాఖ్యానించారు.

భారత్ పై మరియం ప్రశంసలు!:

అనంతరం మాజీ ఎంపీ మరియం భారత్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సమయంలో ఆఫ్గాన్ కు భారత్ మద్దతు అభినందనీయమని అన్నారు. ఈ క్రమంలో... భారత్ కు ఆఫ్గాన్ దగ్గరవ్వడాన్ని పాకిస్థాన్ సహించలేకపోతుందని విమర్శించారు. ఈ సందర్భంగా తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా భారత్‌ - అఫ్గాన్‌ ల మధ్య బలమైన సహకారం ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

భారత్ పై మునీర్ ప్రేలాపనలు.. నిస్సిగ్గు వ్యాఖ్యలు!:

ఆపరేషన్ సిందూర్ సమయంలో కలుగులో దక్కున్నారనే విమర్శలు మూటగట్టుకున్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. మరోసారి భారత్ పై అవాకులు, చెవాకులు పేలారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో తామే విజయం సాధించామని అన్నారు. పాకిస్థాన్ కు చైనా, అమెరికా అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

కాబుల్ లోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన సమావేశంలో భారత్ కు మునీర్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా... పాకిస్థాన్.. తన మిలిటరీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోందని.. భవిష్యత్తులో ఏ విధమైన దాడులకు పాల్పడినా.. భారత్ ఊహకందని విధంగా మిలిటరీ, ఆర్థిక వ్యవస్థపై దాడులు చేస్తామని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News