అరే ఫూల్...వెనక్కి తిరిగి చూడకు నువ్వే !
జీవితం అంటే భ్రమలలో పడి భ్రమరంగా తిరుగుతూ గజిబిజీగా సాగిపోవడమే. మరి ఈ చట్రంలో జీవిత చక్రంలో వేసే ప్రతీ అడుగూ సరైనదే అయి ఉండకపోవచ్చు.;
ఏప్రిల్ నెల 1వ తేదీన ఆల్ ఫూల్స్ డేని జరుపుకుంటారు. ఇది మన కల్చర్ కాదు, పాశ్చాత్య కల్చర్. తమాషా చేయడం అబధ్దాలు చెప్పి నమ్మించడం ఇలా సరదాగా ఆటపట్టించి ఫూల్ అయ్యావు అని టీజ్ చేయడం అదొక థ్రిల్. ఇప్పటి బిజీ తరానికి ఏప్రిల్ ఫూల్స్ డే గురించి పెద్దగా తెలియకపోయినా పాత తరానికి మాత్రం దీని గురించి పూర్తి అవగాహన ఉంది. వారికి మధురమైన అనుభూతులు ఉన్నాయి. చిన్నపుడు తోటి వారిని సాటి స్నేహితులను ఫూల్స్ అని ఆటపట్టించి ఆనందించడంలో ఒక అమాయకత్వం ఉంది. తెలియని బేలతనం ఉంది.
జీవితంలో భాగమే :
తామే గొప్ప అన్న అదొక రకం గర్వం కూడా ఉంది. ఇవన్నీ చిలిపితనంతో కూడుకున్నవే. ఒక విధంగా చెప్పాలీ అంటే ఫూల్ అంటే వేరే ఎవరో అనుకుంటారు. కానీ ఈ జీవితంలో ప్రతీ వారూ ఒక ఫూల్ కిందనే లెక్క. ఏదో ఒక దశలో ఫూలిష్ గా వ్యవహరిస్తూంటారు. ఆనందాలు విషాదాలు ఎలా జీవితాన్ని కదిపి కుదుపుతాయో అలాగే ఫూల్ అవడం కూడా ఒక భాగమే. అందులో తప్పు ఒప్పులు ఉండవు. ఎందుకంటే ఇదే లైఫ్ కాబట్టి. జీవితంలో ఆశించి భంగపడడం కంటే ఫూలిష్ థింగ్ వేరొకటి ఉండదు. అయితే ఆశించకూడదా లక్ష్యాలు పెట్టుకోకూడదా అని వెంటనే ఒక డౌట్ వస్తుంది. కానీ తమది కానిది అర్హత లేనిది ఆశించినపుడు మాత్రం ఫూల్ కాక తప్పదు. అలాంటివి అందరికీ అనుభవాలే మరి.
భ్రమలలోనే :
జీవితం అంటే భ్రమలలో పడి భ్రమరంగా తిరుగుతూ గజిబిజీగా సాగిపోవడమే. మరి ఈ చట్రంలో జీవిత చక్రంలో వేసే ప్రతీ అడుగూ సరైనదే అయి ఉండకపోవచ్చు. మయసభలో దుర్యోధనుడి మాదిరిగా మడుగు కాదనుకుని వేసిన కాలు నేరుగా నీటిలో పడిపోయేలా చేయవచ్చు. ఎన్నో మాయలు మరెన్నో ఆకర్షణల మధ్య సాగే ఊగిసలాడే జీవితంలో అనూహ్యమైన సందర్భాలు అనుకోని ఉదంతాలు అన్నీ ఫూల్ నే చేస్తాయి.
అతి జ్ఞానంతోనూ :
ఇంకా విడమరచి చెప్పాలంటే అజ్ఞానం ఒక్కటే ఫూల్ కాదు అతి జ్ఞానం కూడా ఒక్కోసారి ఫూల్ ని చేస్తుంది, అతి దూకుడు అతి వాగుడూ కూడా ఫూల్స్ గా చేసే సంఘటనలు ఎన్నో. ఇక చిన్న నాటి నుంచి మొదలై పెద్దయి వృద్ధులై సాగిపోయే జీవితంలో మమకారాలు అనురాగాలు బంధాలు అనుబంధాలు అన్నీ పంచుకుని పెంచుకుని వాటి కోసం తరించి తపించి సాగి విసిగి వేసారిన జీవితం కంటే ఫూలిష్ జర్నీ ఏముంటుంది అన్నది కూడా ఉంది. కాదేదీ కవితకు అనర్హం అంటాడు మహా కవి. అలా కాదేదీ విషయం ఫూల్ అయ్యేందుకు అని కూడా మార్చి చెప్పుకోవచ్చు.
వారంతా అచ్చమైన ఫూల్స్ :
మొత్తం మీద ఫూల్ అంటే బాధ పడాల్సింది లేదు. ఫూల్ ఏమీ చెడ్డ పదం కాదు, ఇంకా మనలో మిగిలి ఉన్న చిలిపి తనం అమాయకత్వానికి సంకేతంగా చెప్పుకోవాలి. ఫూల్ అంటే పరాజితుడు కాదు, ఫూల్ అంటే అంటరాని వాడు అసలే కాదు, నిజానికి ఎంతో విశాలమైన విశ్వంలో అంతా తనకు తెలుసని మిడిసిపడే మనిషి కన్నా ఫూల్ ఎవరూ ఉండరు కదా. ఈ అతి చిన్న జీవితంలో లోకం అంతు చూడాలని పేరాశతో అతి ఉత్సాహంతో పరుగు ఎక్కడా ఆపని ప్రతీ వారూ ఫూల్స్ కిందే లెక్క. మరు క్షణం ఏమవుతుందో తెలియని జీవితంలో అంతా తానేనని అన్నీ తనవేనని తాను శాశ్వతుడిని అని భావించి అతిశయించే వారంతా అచ్చమైన ఫూల్స్ గానే పరిగణింపబడతారు.